ఎదురులేని జొకోవిచ్‌ | Sakshi
Sakshi News home page

ఎదురులేని జొకోవిచ్‌

Published Wed, Jan 24 2024 4:23 AM

Djokovic reached the semifinals for the 11th time in the Australian Open - Sakshi

మెల్‌బోర్న్‌: తనకెంతో కలిసొచ్చిన ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ జొకోవిచ్‌ (సెర్బియా) తన జోరు కొనసాగిస్తూ 11వసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో టాప్‌ సీడ్, ప్రపంచ నంబర్‌వన్‌ జొకోవిచ్‌ 7–6 (7/3), 4–6, 6–2, 6–3తో 12వ సీడ్‌ టేలర్‌ ఫ్రిట్జ్‌ (అమెరికా)పై గెలుపొందాడు. 3 గంటల 45 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్‌ 20 ఏస్‌లతో హడలెత్తించాడు.

52 విన్నర్స్‌ కొట్టిన ఈ సెర్బియా స్టార్‌ నెట్‌ వద్దకు 20 సార్లు దూసుకొచ్చి 13సార్లు పాయింట్లు గెలిచాడు. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయిన జొకోవిచ్‌ ప్రత్యర్థి సర్విస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేశాడు. 36 ఏళ్ల జొకోవిచ్‌ ఈ టోర్నీలో గతంలో సెమీఫైనల్‌ చేరిన 10 సార్లూ విజేతగా తిరిగి రావడం విశేషం. మరో క్వార్టర్‌ ఫైనల్లో నాలుగో సీడ్‌ యానిక్‌ సినెర్‌ (ఇటలీ) తొలిసారి ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు.

క్వార్టర్‌ ఫైనల్లో సినెర్‌ 6–4, 7–6 (7/5), 6–3తో ఐదో సీడ్‌ రుబ్లెవ్‌ (రష్యా)ను ఓడించి సెమీఫైనల్లో జొకోవిచ్‌తో పోరుకు సిద్ధమయ్యాడు. ఈ టోర్నీలో సినెర్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. సెమీఫైనల్‌ చేరుకునే క్రమంలో సినెర్‌ ఒక్క సెట్‌ కూడా కోల్పోకపోవడం విశేషం. 

సూపర్‌ సబలెంకా...
మహిళల సింగిల్స్‌ విభాగంలో డిఫెండింగ్‌ చాంపియన్, రెండో సీడ్‌ సబలెంకా (బెలారస్‌), నాలుగో సీడ్‌ కోకో గాఫ్‌ (అమెరికా) సెమీఫైనల్లోకి అడుగు పెట్టారు. క్వార్టర్‌ ఫైనల్లో సబలెంకా 6–2, 6–3తో తొమ్మిదో సీడ్‌ క్రిచికోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై, కోకో గాఫ్‌ 7–6 (8/6), 6–7 (3/7), 6–2తో మార్టా కొస్టుక్‌ (ఉక్రెయిన్‌)పై విజయం సాధించారు. క్రిచికోవాతో 71 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్‌లో సబలెంకా నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్‌ చేసింది.   

Advertisement
 

తప్పక చదవండి

Advertisement