ధోనీని వేధించాను.. కిట్‌ బ్యాగ్‌ కూడా మోయించాను: రైనా

Dhoni Said Take Whatever You Need, Dont Call Me Again Raina Recalls Memories With Dhoni - Sakshi

న్యూఢిల్లీ: సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీని సరదాగా ఆటపట్టించిన సందర్భాన్ని సహచరుడు సురేష్ రైనా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించాడు. ధోనీతో తనకున్న ప్రత్యేకమైన అనుబంధం గురించి వివరిస్తూ.. గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. గుజరాత్‌ లయన్స్‌కు సారథ్యం వహిస్తున్నప్పుడు జరిగిన ఓ సరదా సంఘటన గురించి రైనా వివరించాడు. 2018లో ఐర్లాండ్‌లో జరిగిన ఓ మ్యాచ్‌లో ధోనీ భాయ్‌ 12వ ఆటగాడిగా ఉన్నాడని, తాము బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో డ్రింక్స్‌ అందించాడని పేర్కొన్నాడు. నేను క్రీజ్‌లో ఉన్నప్పుడు పదేపదే గ్లోవ్స్‌, బ్యాట్ల కోసం పిలుస్తుండటంతో.. ధోనీ నా కిట్‌ బ్యాగ్‌ మొత్తం మోసుకొచ్చాడని, తాను సరదాగా ఆటపట్టించాలని అనుకుంటే ధోనీ కాస్త సీరియస్‌గానే రియాక్ట్‌య్యాడని గుర్తు చేసుకున్నాడు.

ఏం కావాలో ఒకేసారి తీసుకో, మళ్లీ మళ్లీ పిలవకని కోపడ్డాడని, దానికి బదులుగా నేను.. నా బ్యాట్‌ హ్యాండ్‌ గ్రిప్‌ తీసుకురా అని చెప్పడంతో భలే మంచోడివే దొరికావని అన్నాడని తెలిపాడు. మాహీ భాయ్‌ కోప పడటాన్ని తాను ఆస్వాధించానని, ఆ రోజు అతను నాకు దొరికాడని సంతోషించానని చెప్పుకొచ్చాడు. ఇదే సందర్భంగా ధోనీతో జరిగిన మరో సరదా సంభాషణను రైనా వెల్లడించాడు. 2016లో ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా ఐపీఎల్ ప్రాంఛైజీ చెన్నై సూపర్‌ కింగ్స్‌పై నిషేధం పడిన విషయం తెలిసిందే. దాంతో రైజింగ్‌ పుణే జట్టుకు ధోనీ, గుజరాత్‌ లయన్స్‌కు సురేష్ రైనా సారథ్యం వహించారు.

ఇరు జట్ల మధ్య రాజ్‌కోట్‌లో జరిగిన ఓ మ్యాచ్‌లో అశ్విన్‌ బౌలింగ్‌ చేస్తుండగా, నేను స్ట్రయిక్‌లో, బ్రెండన్ మెక్‌కలమ్‌ నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో, ఫస్ట్‌ స్లిప్‌లో డుప్లెసిస్‌, ధోనీ భాయ్‌ కీపింగ్‌ చేస్తున్నాడని, ఆ సన్నివేశాన్ని ఊహించుకుంటే పొరుగింటి వాళ్లతో క్రికెట్‌ ఆడినట్టు అనిపించిందని వివరించాడు. పైగా నేను క్రీజులోకి వెళ్లినపుడు 'రండి కెప్టెన్‌ సాబ్‌' అని ధోనీ అన్నాడని, వస్తున్నాను భాయ్‌.. ముందు మీరు జరగండి అని నేను బదులిచ్చానని గుర్తు చేసుకున్నాడు. కాగా, రైనా, ధోనీ ఇద్దరూ అంతర్జాతీయ క్రికెట్‌కు ఒకే రోజు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా.. ప్రస్తుతం వారిద్దరూ చెన్నై జట్టుకు ఆడుతున్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top