![THE DESTRUCTION OF TIM DAVID IN THE BBL, Fantastic News For RCB](/styles/webp/s3/article_images/2025/01/10/tim.jpg.webp?itok=5G030_bH)
ఆర్సీబీ అభిమానులకు అదిరిపోయే వార్త. ఇటీవలే ఆ జట్టులోకి వచ్చిన స్టార్ ఆటగాడు టిమ్ డేవిడ్ బిగ్‌బాష్ లీగ్‌లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. టిమ్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. టిమ్ అరివీర భయంకరమైన ఫామ్ చూసి ఆర్సీబీ అభిమానులు సంబురపడిపోతున్నారు. టిమ్ ఇదే ఫామ్‌లో ఉంటే ఆర్సీబీ తొలి ఐపీఎల్ టైటిల్ నెగ్గడం ఖాయమని చర్చించుకుంటున్నారు.
టిమ్ తాజాగా సిడ్నీ థండర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో టిమ్ 38 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేశాడు. గెలవడం కష్టం అనుకున్న మ్యాచ్‌లో టిమ్ విశ్వరూపం ప్రదర్శించి తన జట్టును (హోబర్ట్ హరికేన్స్) ఒంటిచేత్తో గెలిపించాడు. టిమ్ చివరి వరకు క్రీజ్‌లో ఉండి హరికేన్స్‌ను విజయతీరాలకు చేర్చాడు.
- 62*(28) & Won POTM.
- 68*(38) & Won POTM.
THE DESTRUCTION OF TIM DAVID IN THE BBL - Fantastic news for RCB. 🥶 pic.twitter.com/OSwD9Px6DP— Tanuj Singh (@ImTanujSingh) January 10, 2025
దీనికి ముందు అడిలైడ్ స్ట్రయికర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ టిమ్ ఉగ్రరూపం దాల్చాడు. ఆ మ్యాచ్‌లో టిమ్ 28 బంతులు ఎదర్కొని 3 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేశాడు. ఛేదనలో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆరో స్థానంలో బరిలోకి దిగిన టిమ్.. జట్టును విజయతీరాలకు చేర్చేంతవరకు ఔట్ కాలేదు. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స్ట్రయికర్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఛేదనలో హరికేన్స్ టాపార్డర్ బ్యాటర్లు పెద్దగా రాణించకపోగా.. టిమ్ పెద్దన్న పాత్రి పోషించి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.
సిడ్నీ థండర్‌తో జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టిమ్ హరికేన్స్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన థండర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. థండర్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ డేవిడ్ వార్నర్ (88 నాటౌట్) ఒక్కడే రాణించాడు. సామ్ బిల్లింగ్స్ (28), ఒలివర్ డేవిస్ (17) రెండంకెల స్కోర్లు చేశారు. హరికేన్స్ బౌలర్లలో రిలే మెరిడిత్ రెండు వికెట్లు తీయగా.. స్టాన్‌లేక్, క్రిస్ జోర్డన్, నిఖిల్ చౌదరీ తలో వికెట్ పడగొట్టారు.
165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హరికేన్స్.. టిమ్ డేవిడ్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో 16.5 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. హరికేన్స్ టాపార్డర్ బ్యాటర్లు మిచెల్ ఓవెన్ (13), మాథ్యూ వేడ్ (13), చార్లీ వకీమ్, నిఖిల్ చౌదరీ (29) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. ఐదో స్థానంలో బరిలోకి దిగిన టిమ్ నేనున్నానంటూ తన జట్టును గెలిపించాడు. క్రిస్ జోర్డన్ (18 నాటౌట్) సహకారంతో టిమ్ హరికేన్స్‌ను గెలుపు తీరాలకు చేర్చాడు. థండర్ బౌలర్లలో జార్జ్ గార్టన్ రెండు వికెట్లు పడగొట్టగా... వెస్ అగర్, టామ్ ఆండ్రూస్ తలో వికెట్ దక్కించుకున్నారు.
కాగా, 28 ఏళ్ల టిమ్‌ను ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆర్సీబీ సొంతం చేసుకుంది. టిమ్‌ను ఆర్సీబీ 3 కోట్లకు దక్కించుకుంది. గత సీజన్ వరకు టిమ్ ముంబై ఇండియన్స్‌కు ఆడాడు. ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్నప్పుడు టిమ్ ధర 8.25 కోట్లుగా ఉండేది.
Comments
Please login to add a commentAdd a comment