ఢిల్లీ దూసుకెళుతోంది

Delhi Capitals beat Rajasthan Royals by 46 runs - Sakshi

చెలరేగిన హెట్‌మెయిర్‌

స్టొయినిస్‌ ఆల్‌రౌండ్‌ షో

46 పరుగులతో రాజస్తాన్‌ చిత్తు

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జోరు కొనసాగుతోంది. ఈ సీజన్‌ సాగే కొద్దీ ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యగా మారుతోంది. బ్యాటింగ్, బౌలింగ్‌లతో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న క్యాపిటల్స్‌ ఈ లీగ్‌లో హ్యాట్రిక్‌ విజయాల్ని నమోదు చేసింది. ఓవరాల్‌గా ఆరు మ్యాచ్‌లాడిన ఢిల్లీ ఐదు మ్యాచ్‌ల్లో నెగ్గింది. కేవలం ఒకే ఒక్క పోటీలో ఓడిపోయింది. తాజాగా రాజస్తాన్‌ రాయల్స్‌పై పంజా విసిరింది. మొదట బ్యాటింగ్‌ తడబడినా... హెట్‌మెయిర్‌ మెరుపులతో కోలుకున్న రాజస్తాన్‌ తర్వాత స్పిన్, పేస్‌ బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టును కట్టడి చేసింది.

షార్జా: రాజస్తాన్‌ మొదటి మ్యాచ్‌లో మూడు సార్లు ఐపీఎల్‌ చాంపియన్‌ అయిన చెన్నై సూపర్‌కింగ్స్‌తో ఆడింది. 200 పైచిలుకు పరుగులు చేసి గెలిచింది. తర్వాత కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో 224 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి మరీ జయభేరి మోగించింది. అయితే రాన్రానూ 150, 160 పరుగులకే ఆపసోపాలు పడుతోంది. వరుసగా ఓటమి పాలవుతోంది. ఇప్పుడు కూడా ఆ వరుసలో నాలుగో పరాజయాన్ని చేర్చింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 46 పరుగుల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌ను ఓడించింది.

మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 184 పరుగులు చేసింది. షిమ్రాన్‌ హెట్‌మైర్‌ (24 బంతుల్లో 45; 1 ఫోర్, 5 సిక్సర్లు), స్టొయినిస్‌ (30 బంతుల్లో 39; 4 సిక్సర్లు) మెరిపించారు. ఆర్చర్‌ 3 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ 19.4 ఓవర్లలో 138 పరుగులే చేసి ఆలౌటైంది. రాహుల్‌ తేవటియా (29 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), యశస్వి జైస్వాల్‌ (36 బంతుల్లో 34; 1 ఫోర్, 2 సిక్స్‌లు) మెరుగనిపించారు. ఢిల్లీ బౌలర్‌ రబడ 3 వికెట్లు తీశాడు. కీలకమైన 2 వికెట్లు తీసిన అశ్విన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది.

హెట్‌మైర్‌ సిక్సర్లతో...
ఢిల్లీ ఆట మొదలయ్యాక టాప్‌–4 బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేశారు. ఓపెనర్లు పృథ్వీషా (19), ధావన్‌ (5) సహా కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (22), రిషభ్‌ పంత్‌ (5) బాధ్యతగా ఆడలేదు. ఇన్నింగ్స్‌ను పరుగులతో పేర్చలేదు. చెత్త షాట్లతో పృథ్వీ, ధావన్‌ ఔటైతే వికెట్ల మధ్య నిర్లక్ష్యంగా పరుగు పెట్టిన అయ్యర్, పంత్‌ రనౌట్‌ అయ్యారు. ఫలితంగా 79 పరుగులకే ఈ నలుగుర్ని కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు మొదట స్టొయినిస్, తర్వాత హెట్‌మైర్‌ పెద్దదిక్కులా మారారు.

స్పిన్నర్లు శ్రేయస్‌ గోపాల్, రాహుల్‌ తేవటియా బౌలింగ్‌లో స్టొయినిస్‌ అలవోకగా సిక్సర్లు బాదాడు. దీంతో వికెట్లు రాలినా... పరుగుల కొరత లేనేలేదు. రన్‌రేట్‌ కూడా 8 పరుగులకు తగ్గలేదు. సిక్సర్లు కొడుతున్న స్టొయినిస్‌కు తెవాటియా చెక్‌ పెట్టాడు. దీంతో క్యాపిటల్స్‌ జట్టు 109 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను కోల్పోయింది. ఇక స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌ ఒకరే (హెట్‌మైర్‌) ఉండటంతో 150 పరుగుల స్కోరు చేస్తేనే ఎక్కువనే అంచనా ఏర్పడింది. కానీ ఆ ఒకడే కాసేపు జోరు అందుకున్నాడు. స్కోరు బోర్డును సిక్సర్లతో హోరు పెట్టించాడు.

టై వేసిన 16వ ఓవర్లో ఫోర్, సిక్సర్‌ కొట్టిన హెట్‌మైర్‌ ఆ తర్వాత కార్తీక్‌ త్యాగిని వదిలిపెట్టలేదు. 17వ ఓవర్లో లాంగాఫ్, డీప్‌ మిడ్‌వికెట్‌ మీదుగా రెండు వరుస సిక్సర్లు బాదాడు. ఇదే ఊపుతో లాంగాన్‌లోనూ భారీ షాట్‌ కొట్టాడు. మెరుపు వేగంతో ఫ్లాట్‌గా దూసుకెళ్తున్న ఈ బంతిని బౌండరీ లైన్‌ దగ్గర్లో తెవాటియా గాల్లో ఎగిరి అందుకోవడంతో అతని సిక్సర్ల ఆటకు తెర పడింది. ఆఖర్లో అక్షర్‌ పటేల్‌ 4, 6, 4 కొట్టడంతో 200 ఖాయమనిపించినా... అతను అవుట్‌ కావడంతో పాటు, ఆర్చర్‌ 20వ ఓవర్లో కేవలం 3 పరుగులే ఇవ్వడంతో స్కోరు 184 వద్దే ఆగిపోయింది.

రాజస్తాన్‌ పతనం...
ఈ మ్యాచ్‌ చూసిన వారికి లీగ్‌ ఆరంభంలో కొండంత లక్ష్యాల్ని అవలీలగా పిండి చేసిన రాజస్తాన్, ఇప్పుడు ఆడుతున్న రాజస్తాన్‌ ఒకటేనా అన్న అనుమానం కలుగక మానదు. అప్పట్లో స్మిత్‌ను మించి సామ్సన్‌... సామ్సన్‌ను తలదన్నే సిక్సర్లతో తేవటియా రాయల్స్‌ ఇన్నింగ్స్‌ను గెలిచేదాకా నడిపించారు. కానీ ఇప్పుడు అంతా తలకిందులైంది. ఒకరి కంటే తక్కువగా మరొకరు ఆడి... వికెట్లను సమర్పించుకుంటున్నారు. ఈ మ్యాచ్‌లో కుర్రాడు, ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ కంటే మరో ఓపెనర్‌ బట్లర్‌ (13) తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. కెప్టెన్‌ స్మిత్‌ (17 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కంటే నిర్లక్ష్యంగా సామ్సన్‌ (5) వికెట్‌ పారేసుకున్నాడు.  

పెవిలియన్‌ ‘క్యూ’
రబడ తొలి ఓవర్లో బట్లర్‌ బౌండరీలతో వేగం అందుకున్నాడు. ఢిల్లీ కెప్టెన్‌ అయ్యర్‌ వెంటనే మూడో ఓవర్లోనే అశ్విన్‌ను రంగంలోకి దింపాడు. అతను వచ్చీ రాగానే బట్లర్‌కు పెవిలియన్‌ దారి చూపాడు. రబడ నాలుగో ఓవర్లో ఈ సారి స్మిత్‌ 6, 4 కొట్టాడు. 8 ఓవర్ల దాకా వేగం లేకపోయినా 56/1 స్కోరుతో మెరుగ్గానే కనిపించింది. ఆ తర్వాత బంతికే హెట్‌మైర్‌ అద్భుతమైన క్యాచ్‌కు స్మిత్‌ అవుట్‌ కావడం, స్వల్ప వ్యవధిలో సంజు సామ్సన్, లోమ్రోర్‌ (1)లతో పాటు కుదురుగా ఆడుతున్న జైస్వాల్‌ కూడా వెనుదిరిగారు. 82 పరుగులకే రాజస్తాన్‌ సగం వికెట్లను చేజార్చుకుంది. ఆండ్రూ టై (6), ఆర్చర్‌ (2)లు కూడా బ్యాట్‌లు ఎత్తేయడంతో 100 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన రాయల్స్‌ లక్ష్యానికి అసాధ్యమైన దూరంలో నిలిచింది. తేవటియా కొట్టిన ఫోర్లు, సిక్సర్లు రాజస్తాన్‌ ఓటమి అంతరాన్ని తగ్గించాయే తప్ప గెలిచేందుకు పనికి రాలేదు. బ్యాటింగ్‌లో మెరిపించిన స్టొయినిస్‌ (2/17) కీలకమైన వికెట్లతో బంతితోనూ రాజస్తాన్‌ను దెబ్బతీశాడు.

స్కోరు వివరాలు
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (సి అండ్‌ బి) ఆర్చర్‌ 19; ధావన్‌ (సి) యశస్వి (బి) ఆర్చర్‌ 5; శ్రేయస్‌ (రనౌట్‌) 22; పంత్‌ (రనౌట్‌) 5; స్టొయినిస్‌ (సి) స్మిత్‌ (బి) తేవటియా 39; హెట్‌మైర్‌ (సి) తేవటియా (బి) కార్తీక్‌ త్యాగి 45; హర్షల్‌ (సి) తేవటియా (బి) ఆర్చర్‌ 16; అక్షర్‌ (సి) బట్లర్‌ (బి) టై 17; రబడ (నాటౌట్‌) 2; అశ్విన్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 184.

వికెట్ల పతనం: 1–12, 2–42, 3–50, 4–79, 5–109, 6–149, 7–181, 8–183.

బౌలింగ్‌: ఆరోన్‌ 2–0–25–0, ఆర్చర్‌ 4–0–24–3, కార్తీక్‌ త్యాగి 4–0–35–1, టై 4–0–50–1, గోపాల్‌ 2–0–23–0, తేవటియా 4–0–20–1.

రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: యశస్వి (బి) స్టొయినిస్‌ 34; బట్లర్‌ (సి) ధావన్‌ (బి) అశ్విన్‌ 13; స్మిత్‌ (సి) హెట్‌మైర్‌ (బి) నోర్జే 24; సంజు (సి) హెట్‌మైర్‌ (బి) స్టొయినిస్‌ 5; లోమ్రోర్‌ (సి) అక్షర్‌ (బి) అశ్విన్‌ 1; తేవటియా (బి) రబడ 38; టై (సి) రబడ (బి) అక్షర్‌ 6; ఆర్చర్‌ (సి) శ్రేయస్‌ (బి) రబడ 2; గోపాల్‌ (సి) హెట్‌మైర్‌ (బి) హర్షల్‌ 2; కార్తీక్‌ త్యాగి (నాటౌట్‌) 2; వరుణ్‌ ఆరోన్‌ (సి) పంత్‌ (బి) రబడ 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్‌) 138.

వికెట్ల పతనం: 1–15, 2–56, 3–72, 4–76, 5–82, 6–90, 7–100, 8–121, 9–136, 10–138.

బౌలింగ్‌: రబడ 3.4–0–35–3, నోర్జే 4–0–25–1, అశ్విన్‌ 4–0–22–2, హర్షల్‌ 4–0–29–1, అక్షర్‌ 2–0–8–1, స్టొయినిస్‌ 2–0–17–2.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top