IND vs BAN: దీపక్‌ చాహర్‌కు చేదు అనుభవం.. కనీసం ఫుడ్‌ కూడా లేదంటూ మండిపాటు

Deepak Chahar slams Malaysian Airlines for poor service - Sakshi

వన్డే సిరీస్‌లో పాల్గొనేందుకు బంగ్లాదేశ్‌ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా పేసర్‌ దీపక్‌ చాహర్‌కు చేదు అనుభవం ఎదురైంది.  న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా ఉన్న దీపక్‌ చాహర్‌, శిఖర్‌ ధావన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, శ్రేయస్‌ అయ్యర్‌ నేరుగా వెల్లింగ్‌టన్‌ నుంచి మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ఢాకాకు చేరుకున్నారు.

కానీ మలేషియా ఎయిర్‌లైన్స్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా దీపక్ చాహర్ లగేజ్‌ మాత్రం ఢాకాకు రాలేదు. ఈ క్రమంలో అసహనానికి గురైన చాహర్ మలేషియా ఎయిర్‌లైన్స్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. నేను ఇప్పటి వరకు ఇంత చెత్త సర్వీస్‌ను చూడలేదంటూ ట్విటర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు.

కనీసం ఫుడ్‌ కూడా లేదు
"మలేషియా ఎయిర్‌లైన్స్‌లో దారుణమైన అనుభవం ఎదురైంది. తొలుత మాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మా ఫ్లైట్ మార్చారు. మేము బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించినప్పటికీ.. ఎటువంటి ఆహారం కూడా అందజేయలేదు. మాతో పాటు లగేజ్‌ కూడా రాలేదు. గత 24 గంటల నుంచి లగేజ్‌ కోసం మేము ఎదురుచూస్తున్నాము.

ఇప్పటి వరకు నా లగేజ్‌ రాకపోతే.. రేపు మ్యాచ్‌కు ఏ విధంగా సన్నద్దం అవుతాను" అని చాహర్‌ ట్విటర్‌లో పేర్కొన్నాడు. కాగా చాహర్‌తో పాటు మరి కొంత మంది ప్రయాణికుల లగేజ్‌ కూడా రాలేదు.  ఇక దీపక్ చాహర్ ట్వీట్‌‌పై మలేషియా ఎయిర్‌లైన్స్  నిమిషాల వ్యవధిలోనే స్పందించింది. చాహర్‌కు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలిపింది. ఇక భారత్‌- బంగ్లాదేశ్‌ మధ్య తొలి వన్డే ఆదివారం(డిసెంబర్‌ 4)న ఢాకా వేదికగా జరగనుంది.

చదవండి: Ricky Ponting: చాలా మందిని భయపెట్టా.. నాకు కూడా భయమేసింది.. ఇప్పుడిలా!

 

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top