
సౌతాఫ్రికా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కార్బిన్ బాష్ తన కెరీర్‌లో రెండో టెస్ట్‌లోనే అరుదైన ఫీట్ సాధించాడు. సెంచరీ సహా ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో సౌతాఫ్రికా ప్లేయర్‌గా, ఓవరాల్‌గా 40వ ఆల్‌రౌండర్‌గా రికార్డుల్లోకెక్కాడు. బాష్‌కు ముందు (సౌతాఫ్రికా) జిమ్మీ సింక్లైర్ (106, 6/26), ఏ ఫాల్కనర్ (123. 5/120), జాక్ కల్లిస్ (110, 5/90), జాక్ కల్లిస్ (139 నాటౌట్, 5/21) ఈ ఘనత సాధించారు.
జింబాబ్వేతో తాజాగా ముగిసిన టెస్ట్ మ్యాచ్‌లో బాష్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో బాష్ తొలి ఇన్నింగ్స్‌లో అజేయ సెంచరీ (100) చేసి రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన (5/43) నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో బాష్ సహా డ్రి ప్రిటోరియస్ (153), ముల్దర్ (4/50, 147), కేశవ్ మహారాజ్ (3/70, 51), కోడి యూసఫ్ (3/42, 3/ 22) సత్తా చాటడంతో జింబాబ్వేపై సౌతాఫ్రికా 328 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ గెలిచిన తర్వాతి మ్యాచ్‌లోనే సౌతాఫ్రికా ఛాంపియన్‌లా ఆడి కొత్త టెస్ట్ సైకిల్‌ను (2025-27) ఘనంగా ప్రారంభించింది. రెండు మ్యాచ్‌ల సిరీస్ కోసం జింబాబ్వేలో పర్యటిస్తున్న సౌతాఫ్రికా ద్వితియ శ్రేణి జట్టుతో బరిలోకి దిగింది. అయినా ఛాంపియన్ ఆట ఆడి పసికూన జింబాబ్వేపై తమ పరాక్రమాన్ని చూపించింది. సీనియర్లు బవుమా, మార్క్రమ్, రబాడ లాంటి వారు ఈ సిరీస్ ఆడకుండా విశ్రాంతి తీసుకున్నారు.
ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఓడినప్పటికీ వారి స్థాయికి మించి పోరాటం చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు సౌతాఫ్రికాకు ధీటుగా బదులిచ్చే ప్రయత్నం చేసింది. సీన్ విలియమ్స్ (137) అద్బుతమైన సెంచరీతో జింబాబ్వేను గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. మరో ఎండ్ నుంచి ఎవరి సహకారం లేకపోవడంతో అతని పోరాటం వృధా అయ్యింది. రెండో ఇన్నింగ్స్‌లో జింబాబ్వే పూర్తిగా చేతులెత్తేసింది.
భారీ లక్ష్య ఛేదనలో ఆ జట్టు స్వల్ప స్కోర్‌కే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన అరంగేట్రం ఆటగాడు డ్రి ప్రిటోరియస్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ మ్యాచ్‌లో ప్రిటోరియస్‌తో పాటు డెవాల్డ్ బ్రెవిస్, కోడి యూసఫ్ అరంగేట్రం చేశారు. రెండో టెస్ట్ జులై 6 నుంచి బులవాయో వేదికగానే జరుగనుంది.