మిస్టర్‌ డిపెండబుల్‌.. హ్యాపీ బర్త్‌డే పుజ్జీ..!

Cheteshwar Pujara Birthday BCCI Virat kohli Others Pours Wishes - Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్‌ ఛతేశ్వర్‌ పుజారా నేడు 33వ వసంతంలో అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా అతడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆట పట్ల అతడి నిబద్ధత, అంకితభావాన్ని ప్రశంసిస్తూ ట్వీట్ల వెల్లువ కొనసాగుతోంది. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. ‘‘ హ్యాపీ బర్త్‌డే పుజ్జీ.. నువ్వు ఎల్లప్పుడూ సౌఖ్యంగా, సంతోషంగా ఉండాలి. ఎన్నో గంటల పాటు క్రీజులో ఉండాలి. రాబోయే సంవత్సరం నీకు మరింత గొప్పగా ఉండాలి’’ అని విష్‌ చేశాడు. ఇక బీసీసీఐ సైతం ఈ నయా ‘వాల్‌’కు తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపింది.(చదవండి: 'నాన్నకు దెబ్బ ఎక్కడ తగిలితే అక్కడ ముద్దిస్తా')

‘‘81 టెస్టులు, 6111 పరుగులు.. ఎదుర్కొన్న బంతులు 13572, 18 సెంచరీలు.. శరీరానికి ఎన్నో గాయాలవుతున్నా లెక్కచేయడు. ధైర్యంగా నిలబడతాడు. టీమిండియా మిస్టర్‌ డిపెండబుల్‌ పుజారా హ్యాపీ బర్త్‌డే’’ అని ట్వీట్‌ చేసింది. నాగ్‌పూర్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో శ్రీలంకపై పుజారా సాధించిన చిరస్మరణీయ సెంచరీ(143 పరుగులు) చేసిన అద్భుత క్షణాలకు సంబంధించిన వీడియోను ఈ సందర్భంగా బీసీసీఐ షేర్‌ చేసింది.(చదవండి: పుజారా ఆడకపోయుంటే...)

కాగా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో అందరికంటే ఎక్కువ బంతులు ఎదుర్కొన్న ఆటగాడిగా పుజారా వరుసగా రెండోసారి రికార్డులకెక్కిన విషయం తెలిసిందే. ముఖ్యంగా బ్రిస్బేన్‌ వేదికగా జరిగిన నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ బౌలర్లను ఎదుర్కొంటూ ఒళ్లు హూనం చేసుకున్నాడు. ముఖ్యంగా నిర్ణయాత్మక గబ్బా టెస్టులో, మ్యాచ్‌ను పోగొట్టుకోకూడదనే ఉద్దేశంతో ఒంటికి ఎన్ని గాయాలు అవుతున్నా త‌ట్టుకుని నిలబడ్డాడు. ఆసీస్‌ బౌలర్లు క‌మిన్స్‌, హాజిల్‌వుడ్ వేసిన బంతులు వేగంగా దూసుకువస్తున్నా ఏకాగ్ర‌త‌తో బ్యాటింగ్ కొనసాగించి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఆసీస్‌ బౌన్సీ పిచ్‌ల‌పై అంత సేపు క్రీజులో ఉండి మిస్టర్‌ డిపెండబుల్‌ అని మరోసారి నిరూపించుకున్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top