
స్వదేశంలో సత్తా చాటుకునేందుకు భారత గ్రాండ్‌మాస్టర్, తెలంగాణ ప్లేయర్ అర్జున్ ఇరిగేశి సిద్ధమయ్యాడు. చెన్నై వేదికగా నేటి నుంచి చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నీ జరగనుంది. 10 మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరగనుంది. మాస్టర్స్ విభాగంలో అర్జున్‌తోపాటు భారత్ నుంచి విదిత్ గుజరాతి, కార్తికేయన్ మురళీ, నిహాల్ సరీన్, ప్రణవ్ వెంకటేశ్ బరిలో ఉన్నారు.
ఇతర గ్రాండ్‌మాస్టర్లు అనీశ్ గిరి (నెదర్లాండ్స్), విన్సెంట్ కీమర్ (జర్మనీ), అవండర్ లియాంగ్ (అమెరికా), రే రాబ్సన్ (అమెరికా), జోర్డాన్ వాన్ ఫారీస్ట్ (నెదర్లాండ్స్) కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. కోటి రూపాయల ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో మొత్తం 10 మంది గ్రాండ్‌మాస్టర్లకు ప్రైజ్‌మనీ లభించనుంది.
టాప్–3లో నిలిచిన వారికి వరుసగా రూ. 25 లక్షలు, 15 లక్షలు, 10 లక్షలు అందజేస్తారు. మాస్టర్స్ టోర్నీతోపాటు కేవలం భారత క్రీడాకారులు మాత్రమే పాల్గొనే ‘చాలెంజర్స్’ ఈవెంట్ కూడా జరగనుంది. గ్రాండ్‌మాస్టర్లు ద్రోణవల్లి హారిక, వైశాలి, ప్రాణేశ్, ఇనియన్, లియోన్ ల్యూక్ మెండోంకా, దీప్తాయన్ ఘోష్, ఆధిబన్, ఆర్యన్ చోప్రా, అభిమన్యు పురాణిక్, అంతర్జాతీయ మాస్టర్ హర్షవర్ధన్ పోటీపడుతున్నారు.