CT 2025, IND VS AUS 1st Semis: రోహిత్‌, విరాట్‌ ఇలాంటి నిర్ణయం ఎందుకు? | CT 2025 IND VS AUS 1st Semis: Rohit And Kohli Foolishly Burn DRS After Connolly Traps India Captain Plumb LBW, Video Inside | Sakshi
Sakshi News home page

CT 2025, IND VS AUS 1st Semis: రోహిత్‌, విరాట్‌ ఇలాంటి నిర్ణయం ఎందుకు?

Mar 4 2025 8:46 PM | Updated on Mar 5 2025 1:46 PM

Champions Trophy 2025, IND VS AUS 1st Semis: Rohit And Kohli Foolishly Burn DRS After Connolly Traps India Captain Plumb LBW

ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025లో భాగంగా భారత్‌, ఆస్ట్రేలియా మధ్య ఇవాళ (మార్చి 4) తొలి సెమీఫైనల్ జరుగుతుంది. దుబాయ్‌ వేదికగా జరుగుతున్న ఈ  మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసింది. స్టీవ్‌ స్మిత్‌ (73), అలెక్స్‌ క్యారీ (61) అర్ద సెంచరీలతో రాణించడంతో ఆసీస్‌ 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్‌ ఆటగాళ్లలో ట్రవిస్‌ హెడ్‌ 39, కూపర్‌ కన్నోలీ 0, లబూషేన్‌ 29, జోస్‌ ఇంగ్లిస్‌ 11, మ్యాక్స్‌వెల్‌ 7, డ్వార్షుయిస్‌ 19, ఆడమ్‌ జంపా 7, నాథన్‌ ఇల్లిస్‌ 10 పరుగులు చేశారు. 

భారత బౌలర్లలో మహ్మద్‌ షమీ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్‌ చక్రవర్తి, రవీంద్ర జడేజా తలో 2, హార్దిక్‌ పాండ్యా, అక్షర్‌ పటేల్‌ చెరో​ వికెట్‌ దక్కించుకున్నారు.

ఛేదనలో భారత్‌ లక్ష్యం దిశగా పయనిస్తుంది. 33 ఓవర్ల అనంతరం భారత్‌ స్కోర్‌ 167/3గా ఉంది. శుభ్‌మన్‌ గిల్‌ (8), రోహిత్‌ శర్మ (28), శ్రేయస్‌ అయ్యర్‌ (45) ఔట్‌ కాగా.. విరాట్‌ కోహ్లి (64), అక్షర్‌ పటేల్‌ (20) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలవాలంటే 17 ఓవర్లలో మరో 98 పరుగులు చేయాలి. భారత బ్యాటర్లలో రోహిత్‌ శర్మ వికెట్‌ కూపర్‌ కన్నోలీకి.. గిల్‌ వికెట్‌ డ్వార్షుయిస్‌కు.. శ్రేయస్‌ అయ్యర్‌ వికెట్‌ ఆడమ్‌ జంపాకు దక్కింది.

రోహిత్‌, విరాట్‌ చెత్త నిర్ణయం
కాగా, భారత్‌ బ్యాటింగ్‌ సందర్భంగా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి ఓ చెత్త నిర్ణయం తీసుకున్నారు. ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌ చివరి బంతికి కూపర్‌ కన్నోలీ బౌలింగ్‌లో రోహిత్‌ శర్మ ఎల్బీడబ్ల్యూ అయినట్లు ఫీల్డ్‌ అంపైర్‌ ప్రకటించాడు. రోహిత్‌ వికెట్ల ముందు దొరికిపోయినట్లు సుస్పష్టంగా తెలుస్తుంది. ఈ విషయం రోహిత్‌తో పాటు నాన్‌ స్ట్రయికింగ్‌ ఎండ్‌లో ఉన్న విరాట్‌ కోహ్లి కూడా తెలుసు. 

అయినప్పటికీ రోహిత్‌, కోహ్లితో చర్చించి రివ్యూ వెళ్లడం అభిమానులను విస్మయానికి గురి చేసింది. వికెట్ల ముందు దొరికిపోయినట్లు క్లియర్‌గా తెలుస్తున్నా రోహిత్‌, కోహ్లి రివ్యూకి వెళ్లడమేంటని ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. మ్యాచ్‌లో చాలా దూరం​ ప్రయాణించాల్సి ఉండగా అనవసరంగా రివ్యూ వేస్ట్‌ చేశారని దుమ్మెత్తిపోస్తున్నారు. కాగా, కన్నోలీ సంధించిన ఫుల్‌ లెంగ్త్‌ బంతిని స్వీప్‌ చేయబోయి రోహిత్‌ వికెట్ల ముందు ఈజీగా దొరికిపోయాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement