
అప్పీలును తిరస్కరించిన సీఏఎస్
రజత పతకం ఇచ్చేందుకు నిరాకరణ
భారత స్టార్ రెజ్లర్‌కు తప్పని నిరాశ
కోట్లాది మంది అభిమానుల ప్రార్థనలు ఫలించలేదు. పారిస్ ఒలింపిక్స్‌లో అసమాన పోరాటంతో ఫైనల్‌కు చేరి... అనంతరం 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హత వేటుకు గురైన భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు న్యాయ పోరాటంలోనూ ఊరట దక్కలేదు. తుదిపోరుకు చేరినందుకు రజత పతకమైనా ఇవ్వాలని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (సీఏఎస్)ను ఆశ్రయించిన వినేశ్ ఫొగాట్ అప్పీలు తిరస్కరణకు గురైంది.
పారిస్: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (సీఏఎస్)లో చుక్కెదురైంది. పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరిన వినేశ్ ఫొగాట్... నిర్దేశిత బరువు కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉండటంతో అనర్హతకు గురైంది. దీంతో అనుమతించిన బరువుతోనే ఫైనల్ వరకు చేరినందుకు గానూ... రజత పతకం అందించాలని వినేశ్ సీఏఎస్‌ను ఆశ్రయించింది.
అయితే ఈ అంశంపై ఇప్పటికే రెండుసార్లు తీర్పు వాయిదా వేసిన సీఏఎస్... ఎట్టకేలకు బుధవారం రాత్రి ఏకవాక్యంలో తుది తీర్పు వెల్లడించింది. వినేశ్ పిటిషన్‌ను సీఏఎస్ అడ్‌హాక్ డివిజన్ కొట్టి వేసింది. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) వివరాలు వెల్లడించింది. అథ్లెట్లు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక ఒత్తిళ్లను పరిగణనలోకి తీసుకోవడంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ విఫలమైందని... ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష అభిప్రాయపడింది.
‘నిరాశాజనక తీర్పు. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ), అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి వ్యతిరేకంగా వినేశ్ ఫొగాట్ అభ్యర్థనను ఆర్బిట్రేటర్ తిరస్కరించారు. మహిళల 50 కేజీల విభాగంలో తనకు కూడా రజత పతకం ఇవ్వాలన్న వినేశ్ దరఖాస్తూను కొట్టేశారు’ అని ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష ఒక ప్రకటనలో తెలిపింది. తొలి రోజు నిబంధనల ప్రకారమే బరువు ఉన్నందుకుగానూ దాన్ని పరిగణనలోకి తీసుకొని మానవీయ కోణంలో తీర్పు ఇవ్వాల్సిందని... కానీ అది జరగలేదని పీటీ ఉష వాపోయింది.
కేవలం 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం సబబు కాదని పేర్కొంది. దీంతో ‘పారిస్’ క్రీడల్లో భారత్‌కు మరో పతకం వస్తుందనే ఆశలు ఆవిరయ్యాయి. ఫలితంగా విశ్వక్రీడల్లో భారత్ ఆరు (ఒక రజతం, 5 కాంస్యాలు) పతకాలతోనే సరిపెట్టుకోనుంది. అనర్హత వేటు అనంతరం మానసికంగా కుంగిపోయిన 29 ఏళ్ల వినేశ్.. కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించింది.
సీఏఎస్ తీర్పుపై అప్పీల్ చేయవచ్చా?
కష్ట కాలంలో వినేశ్‌కు అండగా నిలుస్తామని ఐఓఏ ప్రకటించింది. తదుపరి న్యాయ పరమైన అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. అధికారిక వెబ్‌సైట్ వివరాల ప్రకారం సీఏఎస్ తీర్పుపై అప్పీలు చేసే అవకాశం ఉంది. అయితే సీఏఎస్ తీర్పు మారే అవకాశాలు మాత్రం లేవనే చెప్పాలి.
‘ప్రాథమిక విధానపరమైన నియమాల ఉల్లంఘన, ప్రజా పాలసీతో సంబంధం ఉన్న చాలా పరిమిత అంశాలపైనే తీర్పు మార్చే అవకాశం ఉంది. అది మినహా స్విస్ ఫెడరల్ ట్రిబ్యునల్‌కు న్యాయపరిధి పరిమితం’ అని వినేశ్ కేసు వాదించిన ఫ్రాన్స్ లాయర్లు తెలిపారు.