
వరల్డ్ నంబర్‌వన్‌పై గెలిచిన భారత గ్రాండ్‌మాస్టర్
ఫ్రీస్టయిల్ గ్రాండ్‌స్లామ్ చెస్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి
లాస్ వేగస్: మరోసారి భారత చెస్ ప్లేయర్ చేతిలో నార్వే దిగ్గజం, ప్రపంచ మాజీ చాంపియన్, వరల్డ్ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్‌కు ఓటమి ఎదురైంది. ఫ్రీస్టయిల్ గ్రాండ్‌స్లామ్ టూర్ చెస్ టోర్నీలో భాగంగా భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందతో జరిగిన గేమ్‌లో కార్ల్‌సన్ ఓడిపోయాడు. ‘వైట్ గ్రూప్’లో భాగంగా జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌లో తెల్ల పావులతో ఆడిన ప్రజ్ఞానంద 39 ఎత్తుల్లో కార్ల్‌సన్‌ను ఓడించాడు. ఓవరాల్‌గా అన్ని ఫార్మాట్‌లలో (క్లాసికల్, ర్యాపిడ్, బ్లిట్జ్, ఫ్రీస్టయిల్, ఆన్‌లైన్) కార్ల్‌సన్‌పై ప్రజ్ఞానందకిది ఎనిమిదో విజయం కావడం విశేషం.
2022లో ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్, చెస్‌ఏబల్ మాస్టర్స్ టోర్నీలలో ఒక్కోసారి, క్రిప్టో కప్ (ఆన్‌లైన్) టోర్నీలో మూడుసార్లు కార్ల్‌సన్‌ను ఓడించిన ప్రజ్ఞానంద... 2024లో పోలాండ్‌లో జరిగిన సూపర్‌బెట్ టోర్నీలో, నార్వే ఓపెన్ టోర్నీలో ఒక్కోసారి విజయం సాధించాడు. ఇటీవల క్రొయేషియాలో జరిగిన సూపర్ యునైటెడ్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీలో క్లాసికల్ వరల్డ్ చాంపియన్, భారత స్టార్ దొమ్మరాజు గుకేశ్ చేతిలోనూ కార్ల్‌సన్ ఓడిపోయాడు.
ఫ్రీస్టయిల్ చెస్ టోర్నీలో ఎనిమిది మంది మేటి ప్లేయర్లు ఉన్న ‘వైట్ గ్రూప్’లో ప్రజ్ఞానంద 4.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించాడు. ‘వైట్ గ్రూప్’ నుంచి నొదిర్‌బెక్ అబ్దుసత్తారోవ్ (ఉజ్బెకిస్తాన్), సిందరోవ్ (ఉజ్బెకిస్తాన్), అరోనియన్ (అమెరికా) కూడా క్వార్టర్ ఫైనల్ చేరుకున్నారు.
మరోవైపు ఇదే టోర్నీలో ఆడుతున్న తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ కూడా క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. ‘బ్లాక్ గ్రూప్’లో పోటీపడ్డ అర్జున్ 4 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ‘బ్లాక్ గ్రూప్’ నుంచి నకముర, హాన్స్ నీమన్, కరువానా (అమెరికా) కూడా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు.