
వెస్టిండీస్ పర్యటనను ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పరిపూర్ణ విజయంతో ముగించింది. తొలుత మూడు టెస్టుల సిరీస్‌లో ఆతిథ్య జట్టును 3-0తో వైట్‌వాష్ చేసిన కంగారూలు.. తాజాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ (T20I Series)ను కూడా 5-0తో క్లీన్‌స్వీప్ చేశారు.
సెయింట్ కిట్స్ వేదికగా సోమవారం ఉదయం జరిగిన ఐదో టీ20లో విండీస్ (WI vs AUS)ను మూడు వికెట్ల తేడాతో ఓడించి.. సంపూర్ణ విజయం సాధించారు. తద్వారా అంతర్జాతీయ టీ20లలో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను వైట్‌వాష్ చేసిన తొలి జట్టుగా ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డు సాధించింది.
వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన గ్రీన్
ఇక ఈ మ్యాచ్ సందర్భంగా ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ (Cameron Green) కూడా ఓ వరల్డ్ రికార్డు బద్దలు కొట్టాడు. ఇంటర్నేషనల్ టీ20 ఫార్మాట్లో ఓ సిరీస్‌లో లక్ష్య ఛేదనలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
వెస్టిండీస్‌తో ఐదో టీ20లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన విండీస్.. నిర్ణీత 19.4 ఓవర్లలో 170 పరుగులు చేసి ఆలౌట్ అయింది. షిమ్రన్ హెట్‌మెయిర్ మెరుపు అర్ధ శతకం (52)తో టాప్ రన్ స్కోరర్‌గా నిలవగా.. షెర్ఫానే రూథర్‌ఫర్డ్ (17 బంతుల్లో 35) ధనాధన్ దంచికొట్టాడు.
ఇక ఆసీస్ బౌలర్లలో బెన్ డ్వార్షుయిస్ మూడు వికెట్లు కూల్చగా.. నాథన్ ఎల్లిస్ రెండు, ఆరోన్ హార్డీ, గ్లెన్ మాక్స్‌వెల్, ఆడం జంపా ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి.
ధనాధన్ దంచికొట్టిన గ్రీన్, డేవిడ్, ఓవెన్
ఓపెనర్లలో గ్లెన్ మాక్స్‌వెల్ డకౌట్ కాగా.. కెప్టెన్ మిచెల్ మార్ష్ (14)తో పాటు వన్‌డౌన్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ (10) కూడా విఫలమయ్యాడు. ఇలా టాపార్డర్ కుప్పకూలిన వేళ కామెరాన్ గ్రీన్ (18 బంతుల్లో 32), టిమ్ డేవిడ్ (12 బంతుల్లో 30) ధనాధన్ ఇన్నింగ్స్‌తో అలరించారు.
వీరికి తోడు మిచెల్ ఓవెన్ (17 బంతుల్లో 37) మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగగా.. ఆరోన్ హార్డీ 28 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో 17 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయిన ఆసీస్.. 173 పరుగులు చేసింది. ఫలితంగా మూడు వికెట్ల తేడాతో విండీస్‌పై జయభేరి మోగించింది.
అత్యధిక పరుగుల వీరుడిగా గ్రీన్
డ్వార్షుయిస్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కగా.. ఆద్యంతం ఆకట్టుకున్న కామెరాన్ గ్రీన్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. కాగా విండీస్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో గ్రీన్ మొత్తంగా 205 పరుగులు సాధించాడు. ఇవన్నీ లక్ష్య ఛేదనలో వచ్చిన పరుగులే.
తద్వారా ఓ టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా అతడు నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ స్టార్ మార్క్ చాప్‌మన్ పేరిట ఉండేది. 2023లో పాకిస్తాన్‌తో సిరీస్ సందర్భంగా అతడు లక్ష్య ఛేదనలో 203 పరుగులు సాధించాడు.
అంతర్జాతీయ టీ20 సిరీస్‌లో లక్ష్య ఛేదనలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లు
🏏కామెరాన్ గ్రీన్ (ఆస్ట్రేలియా)- 2025లో వెస్టిండీస్ మీద 205 రన్స్
🏏మార్క్ చాప్‌మన్ (న్యూజిలాండ్)- 2023లో పాకిస్తాన్ మీద 203 రన్స్
🏏కెవిన్ డిసౌజా (బల్గేరియా)- 2022లో సెర్బియా మీద 197 పరుగులు
🏏ఉదయ్ హతింజర్ (కంబోడియా)- 2022లో ఇండోనేషియా మీద 189 రన్స్
🏏టిమ్ సీఫర్ట్ (న్యూజిలాండ్)- 2025లో పాకిస్తాన్ మీద 186 రన్స్.
చదవండి: ‘కోహ్లిపై వేటుకు సిద్ధమైన ఆర్సీబీ.. అతడి స్థానంలో మాజీ క్రికెటర్’
Clean Sweep in the Caribbean 💥
Australia deliver a clinical all-round show to seal a 5-0 win over West Indies 🙌#AUSvWI pic.twitter.com/9awxqNFEl2— FanCode (@FanCode) July 29, 2025