
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025 సీజన్ పునఃప్రారంభానికి సమయం అసన్నమవుతోంది. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయిన ఈ ఏడాది క్యాష్‌రిచ్ లీగ్ సీజన్ తిరిగి మే 17 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే రీ షెడ్యూల్‌ను కూడా బీసీసీఐ ప్రకటించింది.
అయితే ఐపీఎల్ తాతాత్కాలికంగా వాయిదా పడడంతో చాలా మంది విదేశీ ఆటగాళ్లు తమ స్వదేశానికి వెళ్లిపోయారు. దీంతో వారు మిగిలిన మ్యాచ్‌లు కోసం తిరిగి భారత్‌కు వస్తారా లేదా అన్న సందిగ్ధం ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్‌కు ఓ గుడ్ న్యూస్ అందింది.
న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ తిరిగి ముంబై ఇండియన్స్ జట్టులో చేరనున్నాడు. వారం పాటు ఈ ధనాధాన్ టీ20 లీగ్ వాయిదా పడడంతో బౌల్ట్ తన స్వదేశానికి వెళ్లిపోయాడు. ఇప్పుడు ఐపీఎల్ మళ్లీ రీ స్టార్ట్ కానుండడంతో బౌల్ట్ ఒకట్రెండు రోజుల్లోనే భారత గడ్డపై అడుగుపెట్టనున్నట్లు ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్‌ఫో తమ కథనంలో పేర్కొంది.
ఈ ఏడాది సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ఇంకా రెండు లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్ధానంలో ఉన్న ముంబై.. తమ ప్లే ఆఫ్స్ స్ధానాన్ని పదిలి చేసుకోవాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించాలి.
ఈ సమయంలో బౌల్ట్ తిరిగి జట్టులో చేరడం ముంబైకి కలిసొచ్చే ఆంశంగా చెప్పుకోవాలి. ఈ ఏడాది సీజన్‌లో బౌల్ట్ అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన ఈ కివీ స్టార్ పేసర్.. 18 వికెట్లు పడగొట్టాడు. ముంబై ఇండియన్స్ తమ తదుపరి రెండు మ్యాచ్‌ల్లో మే 21న ఢిల్లీ క్యాపిటల్స్, మే 26న పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది.
చదవండి: చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా.. దిగ్గజాలకు సైతం సాధ్యం కాని ఘనత సాధించాడు