టీమిండియా యువ ఓపెనర్‌కు ఎదురుదెబ్బ.. నోటీసులు జారీ చేసిన బాంబే హైకోర్టు

Bombay HC Issues Notice To India Opener Prithvi Shaw on Sapna Gill Plea - Sakshi

Prithvi Shaw- Sapna Gill: టీమిండియా యువ ఓపెనర్‌ పృథ్వీ షాకు బాంబే హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ సప్నా గిల్‌తో వివాదం నేపథ్యంలో షాతో పాటు ముంబై పోలీసులకు కూడా గురువారం నోటీసులు ఇచ్చింది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ముంబైలోని ఓ స్టార్‌ హోటల్‌లో పృథ్వీ షా- సప్నా గిల్‌కు గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.

చేతులు కలిపే ఇలా చేశారు
ఈ నేపథ్యంలో తనతో ఉన్న వ్యక్తి సెల్ఫీ ఇవ్వమని అడిగినందుకు దురుసుగా మాట్లాడిన షా.. తనను అసభ్యంగా తాకాడంటూ సప్నా ఆరోపించింది. అతడిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు స్వీకరించడం లేదంటూ ఏప్రిల్‌ మొదటి వారంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించింది సప్నా గిల్‌.

పృథ్వీ షాతో పాటు ఎయిర్‌పోర్టు పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వర్తిసున్న పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ క్రమంలో సప్నా గిల్‌ తరఫు న్యాయవాది అలీ కశిఫ్‌ ఖాన్‌ తన వాదనలు వినిపిస్తూ.. ముంబై క్రికెటర్‌తో పోలీసులు చేతులు కలిపారని, తన క్లైంట్‌పై తప్పుడు కేసు బనాయించి అరెస్టు చేయించారని కోర్టుకు విన్నవించారు.

సీసీటీవీ ఫుటేజీ చూస్తే 
నాటి గొడవకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని గమనిస్తే అసలు విషయమేమిటో అర్ధమవుతుందని పేర్కొన్నారు. తన క్లైంట్‌ అభ్యర్థన మేరకు పృథ్వీ షా, అతడికి సహరించిన పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో బాంబే హైకోర్టు ధర్మాసనం సప్నా గిల్ అభ్యర్థన మేరకు నోటీసులు జారీ చేసింది. జూన్‌లో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్‌ ఎస్‌బీ షుక్రే, ఎంఎం సతాయేలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఆదేశాలు జారీ చేసింది.

కాగా పృథ్వీ షా ప్రస్తుతం ఐపీఎల్‌-2023 సీజన్‌తో బిజీగా ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు స్థాయికి తగ్గట్లు రాణించలేక విమర్శలు మూటగట్టుకుంటున్నాడు.  ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆటలో విఫలమవుతున్న షాకు సప్నా గిల్‌ రూపంలో వ్యక్తిగత జీవితంలోనూ కష్టాలు ఎదురవుతున్నాయంటూ అతడి అభిమానులు ఉసూరుమంటున్నారు. 
చదవండి: అలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు.. క్రెడిట్​ మొత్తం వాళ్లకే: హార్దిక్‌
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top