Selfie Row: Influencer Sapna Gill moves court against Prithvi Shaw - Sakshi
Sakshi News home page

Prithvi Shaw: అసలే దారుణ వైఫల్యం.. పృథ్వీ షాకు మరో భారీ షాక్‌!

Apr 6 2023 11:35 AM | Updated on Apr 6 2023 12:10 PM

Selfie Row: Influencer Sapna Gill Moves Court Against Prithvi Shaw - Sakshi

Prithvi Shaw- Sapna Gill- Selfie Row: టీమిండియా యువ ఓపెనర్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ బ్యాటర్‌ పృథ్వీ షాకు కాలం అస్సలు కలిసి రావడం లేదు. ఐపీఎల్‌-2023లో ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్‌లలో స్థాయికి తగ్గట్లు రాణించలేక విమర్శలు ఎదుర్కొంటున్న షాకు తాజాగా మరో షాక్‌ తగిలింది. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌, నటి సప్నా గిల్‌ అతడిపై క్రిమినల్‌ కేసు ఫైల్‌ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించింది.

కాగా ఫిబ్రవరి 15న ముంబైలోని ఓ స్టార్‌ హోటల్‌ ఆవరణలో పృథ్వీ షా- సప్నా గిల్‌ మధ్య సెల్ఫీ విషయంలో వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. షాపై దాడి కేసులో సప్నా గిల్‌ సహా ఆమె వెంట ఉన్న వాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో బెయిల్‌పై బయటకు వచ్చిన సప్నా పృథ్వీ షాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పృథ్వీ షా అసభ్యంగా తాకాడంటూ ఆరోపణలు
తాను, తన స్నేహితుడు శోభిత్‌ ఠాకూర్‌ తరచుగా ఆ హోటల్‌కు వెళ్తామని.. క్రికెట్‌ ఫ్యాన్‌ అయిన శోభిత్‌ పృథ్వీ షాను సెల్ఫీ అడుగగా అతడు దురుసుగా ప్రవర్తించాడని ఆరోపించింది. ‘‘ఠాకూర్‌ టీనేజర్‌. తాగుబోతుల ప్రవర్తన ఎలా ఉంటుందో తనకి తెలియదు కదా! నిస్సహాయుడైన ఠాకూర్‌పై ఆ గుంపు దాడి చేయాలని చూసింది.

అందుకే నేను జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. గొడవకు దిగి ఠాకూర్‌ను గాయపరుస్తున్న షాను, అతడితో పాటు ఉన్న వాళ్లకు సర్ది చెప్పేందుకు మాత్రమే మధ్యలోకి వెళ్లాను’’ అని సప్నా తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలో షా తనను అసభ్యకరంగా తాకి నెట్టివేశాడంటూ తీవ్ర ఆరోపణలు చేసింది.

పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలి
ఈ నేపథ్యంలో బుధవారం.. ముంబైలోని అంధేరి కోర్టును ఆశ్రయించిన సప్నా గిల్‌.. పృథ్వీ షా, అతడి స్నేహితుడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. బేస్‌బాల్‌ బ్యాట్‌తో తనను గాయపరచడం సహా తనని వేధించినందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. 

అదే విధంగా.. పృథ్వీ షాపై కేసు నమోదు చేయడంలో జాప్యం చేసిన ఎయిర్‌పోర్టు పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు పోలీసులపై కూడా సప్నా ఫిర్యాదు చేసింది. పోలీసులు సరిగా స్పందించకపోవడంతో ఈ మేరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు సప్నా గిల్‌ లాయర్‌ అలీ కాషిఫ్‌ ఖాన్‌ పేర్కొన్నట్లు జాతీయ మీడియా వెల్లడించింది. కాగా షా ఐపీఎల్‌ పదహారో సీజన్‌లో ఆడిన రెండు మ్యాచ్‌లలో వరుసగా 12, 7 పరుగులు మాత్రమే చేసి పూర్తిగా నిరాశపరిచాడు.

చదవండి: బట్లర్‌ను కాదని అందుకే అశూతో ఓపెనింగ్‌.. గెలిచే మ్యాచ్‌లో ఓడిపోయాం: సంజూ
ఆల్‌టైమ్‌ రికార్డు బద్దలు కొట్టిన సంజూ శాంసన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement