‘కిట్‌’ స్పాన్సర్‌ వేటలో... | Sakshi
Sakshi News home page

‘కిట్‌’ స్పాన్సర్‌ వేటలో...

Published Tue, Aug 4 2020 2:48 AM

BCCI Looking For New Sponsorship For Kit - Sakshi

ముంబై: భారత క్రికెట్‌ జట్టుకు కొత్త కిట్‌ స్పాన్సర్‌ను వెతికే పనిలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) పడింది. ప్రముఖ సంస్థ ‘నైకీ’తో బోర్డు కాంట్రాక్ట్‌ వచ్చే నెలతో ముగియనుంది. దాంతో కొత్త అపెరాల్‌ భాగస్వామిని  ఎంచుకునేందుకు బోర్డు బిడ్లను ఆహ్వానించింది. ఆగస్టు 26 వరకు సంస్థలు పోటీ పడవచ్చు. విజేతగా నిలిచే బిడ్డర్‌ టీమిండియా ప్రధాన జట్టుతో పాటు ఇతర అనుబంధ (మహిళా, యువ) జట్లకు కూడా కిట్‌ స్పాన్సర్‌గా వ్యవహరిస్తుంది. భారత క్రికెట్‌ కు సంబంధించి జెర్సీలు, క్యాప్‌లు తదితర అపెరాల్స్‌ను అధికారికంగా అమ్ముకునే హక్కులు వారికి లభిస్తాయి. గత నాలుగేళ్ల కాలానికి ‘నైకీ’ రూ. 30 కోట్ల రాయల్టీ సహా రూ. 370 కోట్లు బోర్డుకు చెల్లించింది.  

14 ఏళ్ల అనుబంధం...
ఈ బిడ్‌లో ప్రస్తుతానికి చూస్తే నైకీ కూడా మళ్లీ పాల్గొనేందుకు అర్హత ఉంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో అది సందేహమే. ఈ ప్రఖ్యాత సంస్థకు భారత క్రికెట్‌తో 14 ఏళ్ల అనుబంధం ఉంది. తొలిసారి 2006 జనవరి 1న బీసీసీఐతో జత కట్టింది. నాడు అడిడాస్, రీబాక్‌లతో పోటీ పడి ఐదేళ్ల కాలానికి 43 మిలియన్‌ డాలర్లు (అప్పట్లో) చెల్లించి అపెరాల్‌ హక్కులు సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కష్టకాలం నేపథ్యంలో స్పాన్సర్‌షిప్‌ మొత్తాన్ని కాస్త తగ్గించి తమనే కొనసాగించాలని నైకీ కోరగా... బోర్డు అందుకు అంగీకరించలేదని సమాచారం. పైగా కోవిడ్‌–19 కారణంగా ఈ ఏడాది పలు సిరీస్‌లు రద్దయిన విషయాన్ని కూడా నైకీ గుర్తు చేసినా లాభం లేకపోయింది. ఒక వేళ ఇప్పుడు కూడా నైకీ బిడ్‌లో పాల్గొన్నా తాము అనుకున్న తక్కువ మొత్తానికే కోట్‌ చేస్తే... ఇతర కంపెనీలు దానిని వెనక్కి తోసి అవకాశం దక్కించుకోవచ్చు.

Advertisement
 
Advertisement
 
Advertisement