కమిన్స్‌పై చర్యలు | BCCI Asks Pat Cummins To Serve Punishment | Sakshi
Sakshi News home page

కమిన్స్‌పై చర్యలు

May 13 2026 1:12 PM | Updated on May 13 2026 1:20 PM

BCCI Asks Pat Cummins To Serve Punishment

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (మే 12) గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో 82 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవిచూసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు మరో షాక్‌ తగిలింది. స్లో ఓవర్‌రేట్ మెయిన్‌టెయిన్‌ చేసినందుకు ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు రూ.12 లక్షల జరిమానా పడింది. ఈ విషయాన్ని బీసీసీఐ ధృవీకరించింది. ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఇది తొలి స్లో ఓవర్‌రేట్ తప్పిదం కావడంతో ఫైన్‌తో సరిపెట్టినట్లు బీసీసీఐ ప్రకటించింది.

ఈ సీజన్‌లో కెప్టెన్లు అక్షర్‌ పటేల్‌ (ఢిల్లీ), హార్దిక్‌ పాండ్యా (ముంబై), శ్రేయస్‌ అయ్యర్‌ (పంజాబ్‌), శుభ్‌మన్ గిల్ (గుజరాత్‌) కూడా స్లో ఓవర్‌రేట్ కారణంగా జరిమానాలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆ జాబితాలో ప్యాట్ కమిన్స్ చేరాడు.

ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ 12 మ్యాచ్‌ల్లో 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఈ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో కనీసం ఒక మ్యాచ్‌లో అయినా గెలవడం కీలకం. తదుపరి మ్యాచ్‌ల్లో ఎస్‌ఆర్‌హెచ్‌.. సీఎస్‌కే (మే 18న చెన్నైలో), ఆర్సీబీతో (మే 22న హైదరాబాద్‌లో) తలపడాల్సి ఉంది.

నిన్నటి మ్యాచ్‌ విషయానికొస్తే.. సన్‌రైజర్స్‌పై గుజరాత్‌ అన్ని విభాగాల్లో ఆధిపత్యం చలాయించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. ఆదిలోనే శుభ్‌మన్‌ గిల్‌ (5), జోస్‌ బట్లర్‌ (7) వికెట్లు కోల్పోయినా.. సాయి సుదర్శన్‌ (61), వాషింగ్టన్‌ సుందర్‌ (50) జట్టును ఆదుకున్నారు. ఫలితంగా గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.

అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. రబాడ (4-0-28-3), హోల్డర్‌ (4-0-20-3), ప్రసిద్ద్‌ కృష్ణ (3-0-23-2), సిరాజ్‌ (3-1-11-1), రషీద్‌ ఖాన్‌ (0.5-0-3-1) ధాటికి ఆ జట్టు 14.5 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారీ తేడాతో పరాజయంపాలైంది. ఈ గెలుపుతో గుజరాత్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకి, ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంది. 

Advertisement
 
Advertisement
Advertisement