పాకిస్తాన్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ!.. ఇక కష్టమే.. | Ban vs Pak: ICC Punishes Pakistan WTC Point deduction Hefty fine | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ!.. ఇక కష్టమే..

May 15 2026 4:15 PM | Updated on May 15 2026 5:41 PM

Ban vs Pak: ICC Punishes Pakistan WTC Point deduction Hefty fine

పాకిస్తాన్‌ టెస్టు జట్టుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) షాన్‌ మసూద్‌ బృందానికి గట్టి షాకిచ్చింది. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-27లో భాగంగా రెండు మ్యాచ్‌లు ఆడేందుకు పాక్‌ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

104 పరుగుల తేడాతో జయభేరి
ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య ఢాకా వేదికగా తొలి టెస్టు జరుగగా.. ఊహించని రీతిలో బంగ్లాదేశ్‌ జయభేరి మోగించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా.. తొలి ఇన్నింగ్స్‌లో 413 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఇందుకు పాక్‌ ధీటుగా బదులివ్వలేకపోయింది.

కేవలం 386 పరుగులు చేసి షాన్‌ మసూద్‌ బృందం ఆలౌట్‌ అయింది. ఈ క్రమంలో 27 పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించిన బంగ్లాదేశ్‌.. తమ రెండో ఇన్నింగ్స్‌లో 240 పరుగులు చేసింది. ఫలితంగా 268 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌.. 163 పరుగులకే కుప్పకూలింది.

దీంతో 104 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ పాక్‌ను మట్టికరిపించి.. 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. బంగ్లాదేశ్‌ సొంతగడ్డపై పాక్‌ మీద టెస్టు మ్యాచ్‌ గెలవడం ఇదే తొలిసారి ​కావడం గమనార్హం. ఇలాంటి తరుణంలో మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లు ఐసీసీ పాక్‌కు షాకిచ్చింది.

భారీ జరిమానా, పాయింట్లలో కోత
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు సందర్భంగా నిర్ణీత సమయంలో బౌలింగ్‌ కోటా పూర్తి చేయనందున.. భారీ జరిమానా విధించడంతో పాటు పాయింట్లలో కోత వేసింది. 

ఈ మేరకు.. ‘‘ఐసీసీ ప్రవర్తనా నియామవళిలోని ఆర్టికల్‌ 2.22 నిబంధన ప్రకారం.. స్లో ఓవర్‌ రేటు మెయింటెన్‌ చేసినందుకు గానూ.. ఆలస్యమైన ప్రతీ ఓవర్‌కు ఐదు శాతం చొప్పున ఆటగాళ్ల ఫీజులో కోత విధిస్తున్నాం.

ఇక ఆర్టికల్‌ 16.11.2 నిబంధన ప్రకారం.. ప్రపంచ చాంపియన్‌షిప్‌ ఆడే జట్లు.. స్లో ఓవర్‌ రేటు మెయింటెన్‌ చేస్తే.. ప్రతీ ఓవర్‌కు ఒక పాయింట్‌ చొప్పున కట్‌ చేస్తాం. పాకిస్తాన్‌ తప్పిదానికి పాల్పడినందున డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఎనిమిది పాయింట్లు కోల్పోయింది’’ అని ఐసీసీ తమ ప్రకటనలో పేర్కొంది.

ఇక కష్టమే
కాగా బంగ్లాతో టెస్టులో పాక్‌ 8 ఓవర్లు వెనుకడింది. ఫలితంగా నిబంధనల ప్రకారం ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులో ఐసీసీ 40 శాతం కోత విధించింది. అదే విధంగా ఎనిమిది పాయింట్లు కట్‌ చేసింది. 

దీంతో ప్రస్తుతం పాకిస్తాన్‌ ఖాతాలో కేవలం నాలుగు పాయింట్లే ఉన్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరాలంటే ఒక్క పాయింట్‌ కూడా కీలకమే. అలాంటిది పాక్‌ ఒకే మ్యాచ్‌లో స్వీయ తప్పిదంతో ఎనిమిది పాయింట్లు కోల్పోయి తమ దారులను దాదాపుగా మూసేసుకుంది.

చదవండి: రాహుల్‌ ద్రవిడ్‌ సంచలన వ్యాఖ్యలు!
 

Advertisement
 
Advertisement
Advertisement