రాహుల్‌ ద్రవిడ్‌ సంచలన వ్యాఖ్యలు! | Need Heroes: Dravid Differs With Gambhir SuperStar Culture Stance | Sakshi
Sakshi News home page

రాహుల్‌ ద్రవిడ్‌ సంచలన వ్యాఖ్యలు!

May 15 2026 2:06 PM | Updated on May 15 2026 2:51 PM

Need Heroes: Dravid Differs With Gambhir SuperStar Culture Stance

టీమిండియా మాజీ హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ ఆలోచనా విధానానికి తాను వ్యతిరేకమని చెప్పకనే చెప్పాడు. రవిశాస్త్రి తర్వాత భారత జట్టుకు మార్గనిర్దేశకుడిగా వచ్చిన ద్రవిడ్‌.. జట్టును విజయపథంలో నిలిపాడు.

టైటిల్‌ గెలిచిన తర్వాత
ఆరంభంలో సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమించి.. 2024లో టీమిండియా టీ20 ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ద్రవిడ్‌ తన పదవి నుంచి సగర్వంగా వైదొలిగాడు. అంతకుముందు ద్రవిడ్‌ మార్గనిర్దేశనంలోనే భారత్‌ వన్డే వరల్డ్‌కప్‌-2023 ఫైనల్‌కు చేరింది.

ఇక ద్రవిడ్‌ నిష్క్రమణ తర్వాత గంభీర్‌ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అతడి కోచింగ్‌లో టీమిండియా ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025, టీ20 ప్రపంచకప్‌-2026 టైటిళ్లు గెలిచింది. అయితే, చాంపియన్స్‌ ట్రోఫీ విజయంలో ద్రవిడ్‌దే కీలక పాత్ర అని.. అతడు నిర్మించిన జట్టే టైటిల్‌ గెలిచిందని నాటి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ద్రవిడ్‌కు క్రెడిట్‌ ఇచ్చాడు.

కోహ్లి, రోహిత్‌ రిటైర్మెంట్‌కు కారణమా?
ఇదిలా ఉంటే.. గంభీర్‌ టీమిండియాలో సూపర్‌స్టార్‌ సంస్కృతిని పారద్రోలి.. సూపర్‌ టీమ్‌గా ఎదిగేందుకు ప్రాధాన్యం ఇస్తాడని అతడి సన్నిహిత వర్గాలు ఇటీవల తెలిపాయి. టెస్టు ఫార్మాట్‌ నుంచి దిగ్గజాలు, సూపర్‌ స్టార్‌ బ్యాటర్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ వారం వ్యవధిలోనే వైదొలగడంతో గంభీర్‌తో విభేదాలే కారణమనే వార్తలు వచ్చాయి.

ప్రతీ క్రీడకు ‘హీరో’ల అవసరం ఉంది
ఈ నేపథ్యంలో రాహుల్‌ ద్రవిడ్‌ తాజాగా టీమిండియాలో ‘సూపర్‌ స్టార్‌ కల్చర్‌’పై స్పందించాడు. స్కూప్‌ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘ప్రతీ క్రీడకు ‘హీరో’ల అవసరం ఉంది. తమ ప్రదర్శనల ద్వారానే ప్లేయర్లు హీరోలుగా ఎదుగుతారు.

మైదానంలో మన ప్రదర్శన బాగుంటునే జాతి మనల్ని గుర్తిస్తుంది. ముఖ్యంగా భారత్‌లో అద్భుతంగా ఆడితే ఓ రేంజ్‌లో ప్రశంసలు వస్తాయి. అదే సమయంలో విమర్శలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అందరి దృష్టి ఆటగాళ్ల మీదే ఉంటుంది. మన ప్రదర్శనలను ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తారు.

వారే స్ఫూర్తి దాతలు
కాబట్టి ఈ దేశంలో ఎంతో గొప్పగా ఆడితే తప్ప సూపర్‌ స్టార్‌ లేదంటే దిగ్గజ ప్లేయర్‌ అనే హోదా రాదు. వ్యక్తిగత ప్రదర్శన బాగుంటే జట్టు విజయాలకూ మనం దోహదపడినవాళ్లము అవుతాము’’ అని రాహుల్‌ ద్రవిడ్‌ పేర్కొన్నాడు. 

సూపర్‌ స్టార్లు భావితరాలకు స్ఫూర్తినిస్తారని.. వారి అవసరం తప్పక ఉందని ద్రవిడ్‌ అభిప్రాయపడ్డాడు. కాగా గంభీర్‌ సూపర్‌ స్టార్‌ ట్యాగులు వద్దంటూ అందరినీ ఒకే గాటన కట్టాలని చూస్తుంటే.. ద్రవిడ్‌ మాత్రం ఈ మేరకు స్పందించడం గమనార్హం.

చదవండి: టీమిండియా టీ20 కెప్టెన్‌గా అతడే!

Advertisement
 
Advertisement
Advertisement