Australian Open: ఆస్ట్రేలియా ఓపెన్‌లో బార్టీ సంచలనం... ఫైనల్లో తలపడబోయేది ఆమెతోనే..

Australian Open Womens Singles: Ashleigh Barty And Collins Will Meet In Final - Sakshi

స్వదేశీ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు ఆస్ట్రేలియన్‌ క్రీడాకారిణి యాష్లే బార్టీ తెరదించింది. 42 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ విభాగంలో ఫైనల్‌ చేరిన ఆసీస్‌ ప్లేయర్‌గా ఆమె గుర్తింపు పొందింది. 1980లో చివరిసారిగా వెండీ టర్న్‌బుల్‌ రూపంలో ఆసీస్‌ మహిళా క్రీడాకారిణి ఈ మెగా టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది.

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ సాధించిన ఆస్ట్రేలియన్‌ క్రీడాకారిణిగా ఘనత సాధించేందుకు బార్టీ మరో విజయం దూరంలో నిలిచింది. అమెరికా క్రీడాకారిణి డానియెల్‌ కొలిన్స్‌తో శనివారం జరిగే ఫైనల్లో బార్టీ గెలిస్తే 1978లో క్రిస్టీన్‌ ఒనీల్‌ తర్వాత ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మహిళల చాంపియన్‌గా నిలిచిన ఆసీస్‌ క్రీడాకారిణిగా గుర్తింపు పొందుతుంది.   

మెల్‌బోర్న్‌: టెన్నిస్‌ సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ ఆస్ట్రేలియ ఓపెన్‌లో ఈ ఏడాది మహిళల సింగిల్స్‌ విభాగంలో కొత్త చాంపియన్‌ అవతరించనుంది. ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా), 27వ సీడ్‌ డానియల్‌ కొలిన్స్‌ (అమెరికా) తొలిసారి ఈ మెగా టోర్నీలో ఫైనల్‌కు అర్హత సాధించారు. గురువారం జరిగిన సెమీఫైనల్స్‌లో యాష్లే బార్టీ 62 నిమిషాల్లో 6–1, 6–3తో అన్‌సీడెడ్‌ మాడిసన్‌ కీస్‌ (అమెరికా)పై... కొలిన్స్‌ 78 నిమిషాల్లో 6–4, 6–1తో ఏడో సీడ్‌ ఇగా స్వియాటెక్‌ (పోలాండ్‌)పై విజయం సాధించారు.

శనివారం జరిగే ఫైనల్లో బార్టీతో కొలిన్స్‌ తలపడనుంది. ముఖాముఖి రికార్డులో బార్టీ 3–1తో కొలిన్స్‌పై ఆధిక్యంలో ఉంది. బారీ్టకిది మూడో గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ కాగా... 28 ఏళ్ల కొలిన్స్‌ తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోరీ్నలో టైటిల్‌ పోరుకు చేరింది. 25 ఏళ్ల బార్టీ 2019లో ఫ్రెంచ్‌ ఓపెన్‌లో, 2021లో వింబుల్డన్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచింది.  

అదే జోరు... 
టైటిల్‌ ఫేవరెట్‌ హోదాకు తగ్గట్టు ఈ టోర్నీలో బార్టీ ఆడుతోంది. ఫైనల్‌ చేరే క్రమంలో ఆరు మ్యాచ్‌లు ఆడిన బార్టీ 6 గంటల 6 నిమిషాలు మాత్రమే టెన్నిస్‌ కోర్టులో గడిపింది. ఒక్క సెట్‌ కూడా తన ప్రత్యర్థులకు కోల్పోని బార్టీ కేవలం 21 గేమ్‌లు మాత్రమే సమర్పించుకుంది. 2017 యూఎస్‌ ఓపెన్‌ రన్నరప్‌ మాడిసన్‌ కీస్‌తో గురువారం జరిగిన సెమీఫైనల్లో బార్టీకి ఏదశలోనూ పోటీ ఎదురుకాలేదు.

ఐదు ఏస్‌లు సంధించి ఒక్క డబుల్‌ ఫాల్ట్‌ కూడా చేయని బార్టీ ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగు సార్లు బ్రేక్‌ చేసింది. 20 విన్నర్స్‌ కొట్టిన బార్టీ 13 అనవసర తప్పిదాలు చేసింది. మరోవైపు 2015 తర్వాత ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ సెమీఫైనల్‌ ఆడిన కీస్‌ ఒక్కసారి కూడా బ్రేక్‌ పాయింట్‌ సంపాదించలేదు.   

‘బ్రేక్‌’తో మొదలు... 
2020 ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్‌ ఇగా స్వియాటెక్‌తో జరిగిన సెమీఫైనల్లో కొలిన్స్‌ ఆరంభం నుంచే ఆధిపత్యం చలాయించింది. తొలి సెట్‌లో, రెండో సెట్‌లో ఆరంభంలోనే రెండుసార్లు చొప్పున స్వియాటెక్‌ సర్వీస్‌లను బ్రేక్‌ చేసిన కొలిన్స్‌ 4–0తో, 4–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి సెట్‌లో 0–4తో వెనుకబడ్డాక స్వియాటెక్‌ కోలుకొని రెండుసార్లు కొలిన్స్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసింది.

అయితే 5–4తో స్కోరు వద్ద కొలిన్స్‌ తన సర్వీస్‌ను నిలబెట్టుకొని తొలి సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్‌లోనూ 0–4తో వెనుకబడ్డ స్వియాటెక్‌ ఈసారి మాత్రం ఒక్క గేమ్‌ మాత్రమే గెలవగలిగింది. ఏడో గేమ్‌లో స్వియాటెక్‌ సరీ్వస్‌ను బ్రేక్‌ చేసిన కొలిన్స్‌ సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకొని ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఏడు ఏస్‌లు సంధించిన కొలిన్స్‌ 27 విన్నర్స్‌ కొట్టింది. స్వియాటెక్‌ నాలుగు డబుల్‌ ఫాల్ట్‌లు, 13 అనవసర తప్పిదాలు చేసింది.  
చదవండి: India Captain: భవిష్యత్తు కెప్టెనా... అసలు అతడిలో ఏ స్కిల్‌ చూసి ఎంపిక చేశారు: సెలక్టర్లపై మండిపడ్డ మనోజ్‌ తివారి

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top