మ్యాక్స్‌వెల్‌ కూడా... | Australian all rounder withdraws from IPL | Sakshi
Sakshi News home page

మ్యాక్స్‌వెల్‌ కూడా...

Dec 3 2025 3:23 AM | Updated on Dec 3 2025 3:23 AM

Australian all rounder withdraws from IPL

ఐపీఎల్‌ నుంచి తప్పుకున్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌

ఫ్రాంచైజీలు మొగ్గుచూపవనే ముందుజాగ్రత్త 

మొయిన్‌ అలీ కూడా దూరం  

సిడ్నీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) నుంచి తప్పుకుంటున్న సీనియర్‌ ఆటగాళ్ల జాబితా పెరుగుతోంది. ఇప్పటికే దక్షిణాఫ్రికా స్టార్‌ ఫాఫ్‌ డుప్లెసిస్, వెస్టిండీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ ఆండ్రె రసెల్‌ లీగ్‌కు దూరం కాగా... ఇప్పుడా జాబితాలో ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్, ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ చేరారు. ఈ నెల 16న అబుదాబి వేదికగా ఐపీఎల్‌ మినీ వేలం జరగనుండగా... ఇప్పటికే దాదాపు అన్నీ ఫ్రాంచైజీల వద్ద సరిపడా విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. దీంతో తమకు అవకాశం దక్కదని భావించిన పలువురు సీనియర్‌ ప్లేయర్లు లీగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నారు. 

2012 నుంచి ఐపీఎల్‌లో కొనసాగుతున్న మ్యాక్స్‌వెల్‌... చాలా సీజన్‌లలో భారీ అంచనాలతో అత్యధిక ధర దక్కించుకున్నా... మైదానంలో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. లీగ్‌లో నాలుగు ఫ్రాంచైజీలకు (పంజాబ్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు) ప్రాతినిధ్యం వహించిన 37 ఏళ్ల మ్యాక్స్‌వెల్‌... తనదైన ముద్ర వేయలేకపోయాడు. ఐపీఎల్‌లో 141 మ్యాచ్‌లాడి 2819 పరుగులు చేసిన మ్యాక్స్‌వెల్‌ 41 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 

ఈ నేపథ్యంలో... ఇక ఐపీఎల్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు మంగళవారం సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించాడు. ‘ఈ ఏడాది ఐపీఎల్‌ వేలంలో నా పేరు నమోదు చేసుకోలేదు. లీగ్‌ నాకు ఎంతో ఇచ్చింది. ఇక్కడ ఎన్నో మరపురాని జ్ఞాపకాలు ఉన్నాయి. కేవలం ఒక క్రికెటర్‌గానే కాకుండా... వ్యక్తిగానూ నన్ను ఐపీఎల్‌ ఎంతో మార్చింది. ఎంతోమంది అంతర్జాతీయ స్టార్‌లతో కలిసి ఆడే అవకాశం దక్కింది. ఇక అభిమానుల ఆదరణ అమోఘం. ఇలాంటి ఎన్నో తీపి గుర్తులను ఎప్పటికీ దాచుకుంటా’ అని మ్యాక్స్‌వెల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపాడు. 

ఓవరాల్‌గా 13 సీజన్‌ల పాటు ఐపీఎల్‌ ఆడిన మ్యాక్స్‌వెల్‌ 2021లో మాత్రమే 500 పైచిలుకు పరుగులు చేశాడు. గతేడాది పంజాబ్‌ కింగ్స్‌ జట్టు అతడిని రూ. 4 కోట్ల 20 లక్షలకు కొనుగోలు చేయగా... ఏడు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన మ్యాక్స్‌వెల్‌ దానికి న్యాయం చేయలేకపోయాడు. దీంతో ఈసారి వేలంలో అతడిని తీసుకునేందుకు ఫ్రాంచైజీలు ముందుకు రాకొపోవచ్చనే ఉద్దేశంతో అతడు లీగ్‌కు దూరం అవుతున్నట్లు ప్రకటించాడు. 

పీఎస్‌ఎల్‌ బరిలో మొయిన్‌ అలీ 
ఇక 8 ఏళ్లుగా ఐపీఎల్‌లో ఆడుతున్న ఇంగ్లండ్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ కూడా ఐపీఎల్‌ను వీడి పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌)లో ఆడేందుకు ఆసక్తి కనబరుస్తున్నాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున మొయిన్‌ అలీ రెండుసార్లు ఐపీఎల్‌ ట్రోఫీ నెగ్గాడు. నవంబర్‌ 30తోనే ఆటగాళ్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ముగియగా... మినీ వేలంలో అత్యధికంగా 77 మంది ప్లేయర్లను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. అందులో 31 మంది విదేశీ ఆటగాళ్లకు చాన్స్‌ ఉంది. 

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ వద్ద అత్యధికంగా రూ. 64.3 కోట్లు ఉండగా... చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఖాతాలో రూ. 43.4 కోట్లు ఉన్నాయి. గత వేలంలో రూ. 23.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసుకున్న వెంకటేశ్‌ అయ్యర్‌ సహా మొత్తం 9 మంది ఆటగాళ్లను కోల్‌కతా ఫ్రాంచైజీ వేలానికి వదిలేసింది. 

2025 మెగా వేలానికి దూరంగా ఉన్న ఆ్రస్టేలియా ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌కు ఈసారి భారీ మొత్తం దక్కే అవకాశం ఉంది. వేలం బరిలో ఉన్న వారిలో రవి బిష్ణోయ్, స్టీవ్‌ స్మిత్, మెక్‌గుర్క్, ఇన్‌గ్లిస్, అట్కిన్సన్, డకెట్, లివింగ్‌స్టోన్, డెవాన్‌ కాన్వే, జెమీసన్, డేవిడ్‌ మిల్లర్, పతిరణ, తీక్షణపై అందరి దృష్టి నిలవనుంది.  

రూ. 2 కోట్ల ప్రాథమిక ధర గల ఆటగాళ్ల జాబితా 
రవి బిష్ణోయ్, వెంకటేశ్‌ అయ్యర్‌ (భారత్‌), ముజీబ్, నవీన్‌ ఉల్‌ హక్‌ (అఫ్గానిస్తాన్‌), సీన్‌ అబాట్, అస్టన్‌ అగర్, కూపర్‌ కొనొల్లీ, జేక్‌ ఫ్రెజర్‌ మెక్‌గుర్క్, కామెరూన్‌ గ్రీన్, జోష్‌ ఇన్‌గ్లిస్, స్టీవ్‌ స్మిత్‌ (ఆ్రస్టేలియా), ముస్తఫిజుర్‌ రహమాన్‌ (బంగ్లాదేశ్‌), అట్కిన్సన్, టాప్‌ బాంటన్, టామ్‌ కరన్, లియామ్‌ డాసన్, బెన్‌ డకెట్, డాన్‌ లారెన్స్, లివింగ్‌స్టోన్, టైమల్‌ మిల్స్, జేమీ స్మిత్‌ (ఇంగ్లండ్‌), ఫిన్‌ అలెన్, మైకేల్‌ బ్రేస్‌వెల్, డెవాన్‌ కాన్వే, జాకబ్‌ డఫీ, మ్యాట్‌ హెన్రీ, కైల్‌ జెమీసన్, ఆడమ్‌ మిల్నె, డారిల్‌ మిచెల్, విల్‌ ఓ రూర్కె, రచిన్‌ రవీంద్ర (న్యూజిలాండ్‌), గెరాల్డ్‌ కోట్జీ, డేవిడ్‌ మిల్లర్, ఇన్‌గిడి, అన్రిచ్‌ నోర్జే, రిలీ రూసో, తబ్రేజ్‌ షమ్సీ, డేవిడ్‌ వీస్‌ (దక్షిణాఫ్రికా), హసరంగ, మతీశ పతిరణ, మహేశ్‌ తీక్షణ (శ్రీలంక), జేసన్‌ హోల్డర్, షై హోప్, అకీల్‌ హుసేన్, అల్జారీ జోసెఫ్‌ (వెస్టిండీస్‌). 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement