విదేశీ ఆటగాళ్లకు బెదిరింపులు! | PSL 2026 In Trouble, Threats To Steve Smith And David Warner Raise Major Security Concerns For Foreign Players | Sakshi
Sakshi News home page

PSL 2026: విదేశీ ఆటగాళ్లకు బెదిరింపులు!

Mar 23 2026 1:45 PM | Updated on Mar 23 2026 2:25 PM

Australia-Other Cricketers Threatened By Armed Opposite Groups Leave PSL

పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఇప్పటికే ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహించేందుకు సిద్ధమైన పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌) నిర్వాహకులకు మరో తలనొప్పి వచ్చి పడింది. తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌ సహా చాలా మంది విదేశీ క్రికెటర్లకు పాకిస్థాన్‌ వ్యతిరేక సాయుధదళం జమాత్‌ ఉల్‌ అహ్రార్‌ నుంచి బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. 

విదేశీ ఆటగాళ్లను హెచ్చరిస్తూ తెహ్రీక్‌ ఈ తాలిబన్‌ పాకిస్థాన్‌కు చెందిన జమాత్‌ ఉల్‌ అహ్రార్ పంచుకున్న లేఖను ఇస్లామాబాద్‌ పోస్ట్‌ తన ‘ఎక్స్‌’లో పంచుకుంది. ‘కొన్ని రోజులుగా అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌ సరిహద్దుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కైబర్‌ పంక్తున్వా, బెలూచిస్థాన్‌ ఫ్రావిన్స్‌కు చెందిన అమాయక ప్రజలపై పాకిస్థాన్‌ అమానుష దాడులకు పాల్పడుతుంది. 

మా ప్రజలపై వారు చేస్తున్న దాష్టీకాలన్నింటిని గమనిస్తూనే ఉన్నాం. త్వరలోనే పాకిస్థాన్‌కు గట్టి బదులు ఇవ్వాలని నిర్ణయించాం. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ సూపర్‌లీగ్‌ (పీఎస్‌ఎల్‌) ఆడేందుకు వచ్చే విదేశీ ఆటగాళ్లకు ఇదే మా హెచ్చరిక. పీఎస్‌ఎల్‌ ఆడేందుకు పాకిస్థాన్‌కు రావొద్దు. ఇక్కడి పరిస్థితులు అంతగా బాలేవు. కాబట్టి ఆటగాళ్ల భద్రతకు ఎటువంటి గ్యారంటీ ఇవ్వలేము. నిజానికి మేము క్రికెట్‌కు వ్యతిరేకులం కాదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా పీఎస్‌ఎల్‌ నిర్వహించడం మంచిది కాదు. 

పీఎస్‌ఎల్‌ ఆడేందుకు వచ్చే విదేశీ ఆటగాళ్లు అవనసరంగా ఇబ్బంది పడడం ఇష్టం లేదు. కాబట్టి పాకిస్థాన్‌కు రాకపోవడమే మంచిది. ఒకవేళ వస్తే పాక్‌ విడిచి వెళ్లిపోతే మంచిదని మా అభిప్రాయం.’ అని లేఖలో పేర్కొంది. పశ్చియాసియా యుద్ధం, అఫ్గానిస్థాన్‌తో వైరం కారణంగా పీఎస్‌ఎల్‌లో ఖాళీ స్టేడియాల్లో నిర్వహించాలని ఆదివారం పీసీబీ చైర్మన్‌ మోసిన్‌ నఖ్వీ ఒక ప్రకటన విడుదల చేశారు. 

ఇంతలో పాకిస్థాన్‌ వ్యతిరేక శక్తుల నుంచి లేఖ రావడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే భద్రతా, ఇతర కారణాల రీత్యా చాలా మంది విదేశీ ఆటగాళ్లు పీఎస్‌ఎల్‌కు గుడ్‌బై చెబుతున్నారు. షనక, ముజరబానీ, స్పెన్సర్‌ జాన్సన్‌ తదితరులు జాబితాలో ఉన్నారు. ఇక మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న పీఎస్‌ఎల్‌లో ఈసారి ఆస్ట్రేలియా క్రికెటర్లు సహా మొయిన్‌ అలీ (ఇంగ్లండ్‌), డెవన్‌ కాన్వే (న్యూజిలాండ్‌) ఇలా చాలా మందే ఉన్నారు. కానీ తాజా బెదిరింపులతో అసలు పీఎస్‌ఎల్‌ సక్రమంగా జరుగుతుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

చదవండి: 60 ఏండ్లు వచ్చేదాకా ఆడుతా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement