
ఆసియా కప్ 2025 (Asia cup 2025) హైడ్రామా ఇంకా కొనసాగుతూనే ఉంది. టోర్నీ ముగిసి రెండు రోజులైనా ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టుకు (Team India) విన్నింగ్ ట్రోఫీ అందలేదు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహిసిన్ నఖ్వీ (Mohsin Naqvi) చేతుల మీద నుంచి విన్నింగ్ ట్రోఫీని అందుకునేందుకు టీమిండియా నిరాకరించిన విషయం తెలిసిందే.
దీనికి ప్రతిగా నఖ్వీ ట్రోఫీతో పాటు భారత ఆటగాళ్లకు ఇవ్వాల్సిన మెడల్స్‌ను తీసుకెళ్లిపోయాడు. భారత ఆటగాళ్లు ట్రోఫీ లేకున్నా గెలుపు సంబురాలు అద్భుతంగా చేసుకున్నారు.
తాజాగా నఖ్వీ తాను ఎత్తుకెళ్లి పోయిన ట్రోఫీని, మెడల్స్‌ను భారత ఆటగాళ్లకు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించినట్లు తెలుస్తుంది. అయితే ఇందుకు ఓ కండీషన్ పెట్టాడట. అతనే స్వయంగా భారత కెప్టెన్‌కు ట్రోఫీని, మిగతా ఆటగాళ్లకు మెడల్స్‌ను ఇస్తానని చెప్పాడట. నఖ్వీ పెట్టిన ఈ కండీషన్‌కు భారత ఆటగాళ్లు ససేమిరా అన్నట్లు సమాచారం.
ఈ వివాదం అతి త్వరలో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇవాళ (సెప్టెంబర్ 30) జరుగబోయే ఏసీసీ సమావేశంలో బీసీసీఐ నఖ్వీని తూర్పారబెట్టాలని డిసైడైంది. ఇది అతని పదవికే ముప్పు తెచ్చిపెట్టవచ్చు. ఈ వివాదాన్ని బీసీసీఐ ఐసీసీ వరకు కూడా తీసుకెళ్లకుండా ఏసీసీలోనే తెంచేయాలని కృత నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తుంది.
కాగా, సెప్టెంబర్ 28న జరిగిన ఆసియా కప్ ఫైనల్లో భారత్ పాకిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఉత్కంఠగా సాగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్.. కుల్దీప్ యాదవ్ (4-0-30-4) ధాటికి 19.1 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది.
అనంతరం 147 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ సైతం తొలుత తడబడినప్పటికీ.. తిలక్ వర్మ (53 బంతుల్లో 69; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ అర్ద శతకంతో టీమిండియాను గెలిపించాడు. సంజూ శాంసన్ (24), శివమ్ దూబే (33) తిలక్‌కు సహకరించారు. రింకూ సింగ్ బౌండరీ బాది మ్యాచ్‌ను ముగించాడు.
ఈ టోర్నీలో భారత్ మొత్తం మూడు సార్లు పాక్‌ను ఓడించింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ టోర్నీలో భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు హ్యాండ్‌షేక్‌ను నిరాకరించారు. దీన్ని అవమానంగా భావించిన పీసీబీ నానా యాగీ చేసినప్పటికీ.. ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.
తమకు అనుకూలంగా ఏదీ జరగడం లేదని తెలిసి పీసీబీ వారి ఆటగాళ్లను రెచ్చగొట్టింది. భారత్‌ను, భారత ఆటగాళ్లను ఉద్దేశిస్తూ పాక్ ఆటగాళ్లు హరీస్ రౌఫ్, సాహిబ్‌జాదా ఫర్హాన్ చాలా ఓవరాక్షన్ చేశారు. దీనికి కూడా పాక్ ఆటగాళ్లు మూల్యం చెల్లించుకున్నారు. పాక్ ఆటగాళ్ల కవ్వింపులకు ఎక్కడా సహనం కోల్పోని టీమిండియా మైదానంలో వారికి తగు రీతో బద్ది చెప్పింది.
చదవండి: ప్రపంచ క్రికెట్‌లో పెను సంచలనం.. మాజీ ఛాంపియన్‌ను మట్టికరిపించిన పసికూన