Asia Cup 2022 IND VS PAK Super 4 Match: హార్ధిక్‌పై విరుచుకుపడిన రోహిత్‌.. అదే రేంజ్‌లో ఎదురుతిరిగిన స్టార్‌ ఆల్‌రౌండర్‌

Asia Cup 2022: Rohit Sharma Fired On Hardik Pandya During IND VS PAK Super 4 Match - Sakshi

ఆసియా కప్‌ 2022 సూపర్‌-4 దశ మ్యాచ్‌ల్లో భాగంగా ఆదివారం (సెప్టెంబర్‌ 4) భారత్‌-పాక్‌ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే చివరి ఓవర్లలో టీమిండియా బౌలర్లు చేసిన తప్పిదాల కారణంగా పాక్‌ను విజయం వరించింది. తద్వారా గ్రూప్‌ దశలో రోహిత్‌ సేన చేతిలో ఎదురైన పరాభవానికి పాక్‌ ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి పాక్‌ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. కోహ్లి (44 బంతుల్లో 60; 4 ఫోర్లు, సిక్స్‌) అర్ధసెంచరీతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. 

ఓపెనర్లు రోహిత​ శర్మ (20 బంతుల్లో 28; ఫోర్‌, 2  సిక్సర్లు), కేఎల్‌ రాహుల్‌ (16 బంతుల్లో 28; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) భారత ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశారు. అయితే మధ్యలో రిషబ్‌ పంత్‌ (12 బంతుల్లో 14; 2 ఫోర్లు), హార్ధిక్‌ పాండ్యా (0) అనవసర తప్పిదాల కారణంగా భారత్‌ భారీ స్కోర్‌ చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. పంత్‌ అనవసర రివర్స్‌ స్వీప్‌కు ప్రయత్నించి వికెట్‌ను సమర్పించుకోగా.. హార్ధిక్‌ షార్ట్‌ బంతిని సరిగ్గా ఆడలేక సునాయాస క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాట పట్టాడు. 

నిర్లక్ష్యపు షాట్‌ ఆడినందుకు గాను పెవిలియన్‌కు చేరాక పంత్‌పై విరుచుకుపడిన రోహిత్‌..  మ్యాచ్‌ సందర్భంగా హార్ధిక్‌తోనూ వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. పంత్‌పై డ్రస్సింగ్‌ రూమ్‌లో ఎగిరెగిరిపడిన రోహిత్‌.. బ్యాటింగ్‌కు వెళ్లే ముందు హార్ధిక్‌తోనూ వాదించినట్లు లైవ్‌లో కనిపించింది. రోహిత్‌ వీరిద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. పంత్‌.. రోహిత్‌ క్లాస్‌ పీకుతుంటే సంజాయిషీ చెప్పుకునే ప్రయత్నం చేయగా.. హార్ధిక్‌ మాత్రం రోహిత్‌కు ఎదురు సమాధానం చెబుతున్నట్లు వీడియోలో స్పష్టంగా తెలుస్తుంది. నువ్వేంటి నాకు చెప్పేది.. అన్నట్లుగా హార్ధిక్‌ హావభావాలు ఉన్నాయి. 

దీంతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందని నెటిజన్లు అనుకుంటున్నారు. ఐపీఎల్‌లో హార్ధిక్‌ ముంబై ఇండియన్స్‌ని వదిలి వెళ్లడానికి కూడా రోహితే కారణమని పాండ్యా అభిమానులు ఆరోపిస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ.. పాక్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైన హార్ధిక్‌.. బౌలింగ్‌లోనూ దారుణంగా నిరాశపరిచాడు. 4 ఓవర్లలో ఒక వికెట్‌ పడగొట్టి ఏకంగా 44 పరుగులు సమర్పించుకున్నాడు. గ్రూప్‌ దశలో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో పాక్‌ను ఒంటిచేత్తో మట్టికరించిన హార్ధిక్‌.. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి పరోక్ష కారణమయ్యాడు. 

హార్ధిక్‌తో పాటు భువీ (1/40), చహల్‌ (1/43) ధారాళంగా పరుగులు ఇవ్వడంతో పాటు 18వ ఓవర్లో అర్షదీప్‌.. అసిఫ్‌ అలీ క్యాచ్‌ జారవిడచడంతో భారత్‌ 5 వికెట్ల తేడాతో పాక్‌ చేతిలో చిత్తైంది. అర్ష్‌దీప్‌ తప్పిదంతో బతికిపోయిన అసిఫ్‌ అలీ.. ఆ తర్వాతి ఓవర్లో (భువనేశ్వర్‌ కుమార్‌) సిక్స్‌, ఫోర్‌.. ఆఖరి ఓవర్లో (అర్ష్‌దీప్‌) బౌండరీ బాది పాక్‌ను విజయపు అంచుల వరకు తీసుకెళ్లాడు. చివరి రెండు బంతుల్లో పాక్‌ విజయానికి రెండు పరుగులు అవసరం కాగా.. ఇఫ్తికర్‌ అహ్మద్‌ లాంఛనం మ్యాచ్‌ను ముగించాడు. 
చదవండి: Ind Vs Pak: ఏయ్‌.. నువ్వేం చేశావో అర్థమైందా అసలు? అర్ష్‌దీప్‌పై మండిపడ్డ రోహిత్‌

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top