షార్జా మాస్టర్స్‌ విజేత అర్జున్‌

Arjun Erigaisi Convincingly Clinches 6th Sharjah Masters Title - Sakshi

ఆరంభ రౌండ్‌లలో తడబడ్డా... చివర్లో అనూహ్యంగా పుంజుకున్న తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌ షార్జా మాస్టర్స్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నీలో చాంపియన్‌గా అవతరించాడు. గురువారం ముగిసిన ఈ టోర్నీలో నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత అర్జున్‌ 6.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. చివరి రౌండ్‌లో తెల్లపావులతో ఆడిన అర్జున్‌ 27 ఎత్తుల్లో నోదిర్‌బెక్‌ యాకుబోయెవ్‌ (ఉజ్బెకిస్తాన్‌)పై గెలిచాడు. ఎనిమిదో రౌండ్‌ తర్వాత మరో ఏడుగురితో కలిసి అర్జున్‌ సంయుక్తంగా ఆధిక్యంలో ఉన్నాడు.

అయితే తొమ్మిదో రౌండ్‌లో అర్జున్‌ గెలుపొందగా... మిగతా ఆరుగురు ప్లేయర్లు తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకోవడంతో అర్జున్‌కు టైటిల్‌ ఖరారైంది. భారత్‌కే చెందిన దొమ్మరాజు గుకేశ్‌ ఆరు పాయింట్లతో మరో ఏడుగురితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా గుకేశ్‌కు రెండో ర్యాంక్‌ లభించింది. విజేతగా నిలిచిన అర్జున్‌కు 10 వేల డాలర్లు (రూ. 8 లక్షల 27 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top