
వాంటా (ఫిన్‌లాండ్): భారత రైజింగ్ షట్లర్ అన్‌మోల్ ఖరబ్... అర్క్‌టిక్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సెమీఫైనల్లో పరాజయం పాలైంది. చక్కటి ఆటతీరుతో సెమీస్ వరకు చేరిన అన్‌మోల్... ప్రపంచ నాలుగో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్) చేతిలో ఓడింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 62వ ర్యాంకర్ అన్‌మోల్ 10–21, 13–21తో మూడుసార్లు ప్రపంచ చాంపియన్ యామగుచి చేతిలో ఓడింది.
29 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో ఫరీదాబాద్‌కు చెందిన 18 ఏళ్ల టీనేజ్ షట్లర్ అన్‌మోల్... యామగుచి ఎదుట నిలువలేకపోయింది. వరుస గేమ్‌ల్లో ఓడి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. రెండు గేమ్‌ల్లోనూ అన్‌మోల్ కాస్త పోరాటం కనబర్చినా... జపాన్ స్టార్ అనుభవం ముందు అది సరిపోలేదు. తొలిసారి సూపర్–500 టోర్నమెంట్‌లో సెమీస్‌కు చేరిన అన్‌మోల్ అక్కడితోనే వెనుదిరిగింది. ఈ ప్రదర్శనతో అన్‌మోల్‌కు 18,050 డాలర్ల (సుమారు 16 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది.