
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్‌లో యు ముంబా జట్టుకు అనిల్ చప్రానా హెడ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. పీకేఎల్ 11వ సీజన్‌లో యు ముంబా జట్టుకు హెడ్ కోచ్‌గా ఉన్న గులామ్‌రజా మజందరాని (ఇరాన్) సీజన్ ముగిశాక తన బాధ్యతల నుంచి వైదొలిగాడు.
గత సీజన్‌లో అనిల్ చప్రానా యు ముంబా జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా పని చేశాడు. గులాంరజా తప్పుకున్న తర్వాత 12వ సీజన్ కోసం భారత మాజీ ప్లేయర్ రాకేశ్ కుమార్‌ను యు ముంబా కొత్త హెడ్ కోచ్‌గా నియమించుకుంది. అయితే ఆదివారం అనూహ్య పరిణామంచోటు చేసుకుంది.
రాకేశ్‌ను హెడ్ కోచ్ పదవి నుంచి తప్పిస్తున్నామని ముంబా సీఈఓ సుహైల్ చందోక్ తెలిపారు. రాకేశ్‌తో సంప్రదింపులు చేశాకే ఈ నిర్ణయం తీసుకున్నామని చందోక్ వివరించారు. 2022లో యు ముంబా జట్టుకు హెడ్ కోచ్‌గా ఉన్న అనిల్ చప్రానాకు మరోసారి ఆ బాధ్యతలు అప్పగిస్తున్నామని, అసిస్టెంట్ కోచ్‌గా పారి్థబన్‌ను ఎంపిక చేశామని సోమవారం సదరు ఫ్రాంచైజీ పేర్కొంది.
ఈనెల 31న, జూన్ 1న పీకేఎల్ 12వ సీజన్ కోసం ఆటగాళ్ల వేలం కార్యక్రమం జరగనుంది. 2014లో పీకేఎల్ ఆరంభ సీజన్ నుంచి పోటీపడుతున్న యు ముంబా జట్టు రెండుసార్లు రన్నరప్‌గా, ఒకసారి చాంపియన్‌గా (2015) నిలిచింది. గత సీజన్‌లో యు ముంబా టాప్–6లో నిలిచి ఎలిమినేటర్ మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ చేతిలో ఓడింది.