అయ్యో...ముర్రే

Andy Murray Suffers Shock Loss To Felix Auger In Round 2 - Sakshi

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌లో మాజీ చాంపియన్‌ ఆండీ ముర్రే (బ్రిటన్‌)కు షాక్‌ తగిలింది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ విభాగంలో  ముర్రే రెండో రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టాడు. మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టాలని భావించిన ముర్రేకు కెనడాకు చెందిన 15వ సీడ్‌ ఫెలిక్స్‌ అగర్‌ అలియాస్సిమ్‌ షాకిచ్చాడు. వరుస సెట్లలో గెలిచి ముర్రేపై అద్భుత విజయం సాధించాడు. తొలి రౌండ్‌లో కష్టపడి నెగ్గిన ముర్రే.. రెండో రౌండ్‌లో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. ఫెలిక్స్‌ అగర్‌ 6-2, 6-3, 6-4 తేడాతో ముర్రేపై సంచలన విజయం నమోదు చేశాడు. అసలు ముర్రేకు ఏమాత్రం అవకాశం ఇ‍వ్వని ఆగర్‌ హ్యాట్రిక్‌ సెట్లను గెలుచుకుని మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. (చదవండి: టాప్‌ సీడ్‌ ఆట ముగిసింది)

దాదాపు 20 నెలల తర్వాత తొలి గ్రాండ్‌స్లామ్‌ ఆడుతున్న ముర్రే.. ఫెలిక్స్‌ ఆగర్‌ దెబ్బకు మెగా టోర్నీ నుంచి భారంగా నిష్క్రమించక తప్పలేదు. 20 ఏళ్ల ఫెలిక్స్‌ ఆగర్‌ తొలి సెట్‌ను సునాయాసంగా గెలుచుకుని పైచేయి సాధించాడు. ఆపై రెండో సెట్‌లో కూడా అదే జోరును ప్రదర్శించిన ఫెలిక్స్‌.. మూడో సెట్‌లో కాస్త శ్రమించాడు. 2012 యూఎస్‌ ఓపెన్‌లో చాంపియన్‌గా నిలిచిన ముర్రే.. మరొకసారి ఈ టైటిల్‌ను గెలవాలనుకున్న ఆశలకు రెండో రౌండ్‌లోనే బ్రేక్‌ పడింది. తుంటి భాగానికి రెండు సార్లు సర్జరీ చేయించుకున్న ముర్రే.. తొలి  రౌండ్‌ను  అతికష్టం మీద గెలిచాడు.  4 గంటల 39 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ముర్రే తొలి రెండు సెట్‌లు కోల్పోయి ఆ తర్వాత వరుసగా మూడు సెట్‌లు గెలిచి ఊపిరి పీల్చుకున్నాడు. కాగా, రెండో రౌండ్‌లో గ్రౌండ్‌లో కదలడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డ ముర్రే తన పోరును ఆదిలోనే ముగించేశాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top