కంటి చూపు సరిగా లేకున్నా.. క్రికెటర్‌గా క్లిక్‌ అయ్యాడు! | Sakshi
Sakshi News home page

కంటి చూపు సరిగా లేకున్నా.. క్రికెటర్‌గా క్లిక్‌ అయ్యాడు!

Published Tue, Jul 5 2022 7:50 PM

Anantapur: Visually Impaired Cricket Player Ganesh Profile, Career - Sakshi

పుట్టుకతోనే దృష్టి లోపం.. దానికి తోడు కటిక పేదరికం.. సమస్యను సవాల్‌గా స్వీకరించాడు... కృషి, పట్టుదలతో అంధత్వాన్ని జయించాడు. అన్నీ బాగుండి.. ఆర్ధికస్తోమత సహకరించి.. ఏ కళలోనైనా, క్రీడలోనైనా రాణించడం పెద్ద విషయమేమీ కాదు. కంటి చూపు సరిగా లేకపోయినా చదువుతో పాటు క్రికెట్‌లోనూ రాణిస్తూ పేరుతెచ్చుకున్న గణేష్‌ విజయ ప్రస్థానంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం 

నల్లమాడ: సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం గంగాపురం గ్రామానికి చెందిన సరస్వతి, ప్రభాకర్‌ దంపతులు వ్యవసాయ కూలీలు. అరకొర సంపాదనతో అతి కష్టంపై కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. వీరి రెండో కుమారుడు గణేష్‌.. పుట్టుకతోనే దృష్టి లోపంతో బాధపడుతుండేవాడు. తల్లిదండ్రులు పలు ఆస్పత్రుల్లో చూపించారు. శస్త్రచికిత్స చేస్తే చూపు మెరుగుపడుతుందన్న వైద్యుల సూచన మేరకు ఆపరేషన్‌నూ చేయించారు. అయినా ఫలితం లేకపోయింది. 30 శాతం కంటి చూపుతో ఉన్న కుమారుడి భవిష్యత్తు తలచుకుని నిరుపేద తల్లిదండ్రులు మరింత కుంగిపోయారు. 
 
చదువుల్లో టాప్‌..  
గణేష్‌ విద్యాభ్యాసం ఆద్యంతం బ్రెయిలీ లిపిలోనే సాగింది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ కదిరి సమీపంలోని మొటుకుపల్లి ఆర్డీటీ ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నాడు. ఆరు నుంచి పదో తరగతి వరకూ అనంతపురం సమీపంలోని పంగల్‌ రోడ్డులో ఉన్న ఆర్డీటీ సమ్మిళిత ఉన్నత పాఠశాలలో, ఇంటర్‌ తిరుపతిలోని ఎస్వీ జూనియర్‌ కళాశాలలో, అక్కడే ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాలలో డిగ్రీ, ఎస్వీ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశాడు. కృషి, పట్టుదల ఉంటే దేనినైనా సాధించవచ్చునని నిరూపించిన గణేష్‌ ప్రస్తుతం ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు.  


క్రికెట్‌ అంటే మక్కువ..
 
గణేష్‌కు చిన్నప్పటి నుంచే క్రికెట్‌ అంటే ఆసక్తి ఎక్కువ. ఐదో తరగతిలో ఉన్నప్పుడే తోటి విద్యార్థులతో కలిసి క్రికెట్‌ ఆడడం ప్రారంభించాడు. ఈ క్రమంలో పాఠశాల స్థాయి, జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కింది. ఆయా పోటీల్లో ప్రతిభ చాటుకోవడంతో అతని క్రీడా ప్రస్థానం మలుపు తిరిగింది. 2012లో తిరుపతి జట్టు తరఫున ఆడి బీ2 (30 శాతం కంటి చూపు ఉన్నవారు) విభాగంలో ఆంధ్రా ప్రాబబుల్స్‌కు ఎంపికయ్యాడు. అనంతరం ఆంధ్రాజట్టులో స్థానం దక్కించుకుని ఆల్‌రౌండర్‌గా తన ప్రత్యేకతను చాటుకున్నాడు.

ఇప్పటివరకూ తాను ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ అత్యధిక వికెట్లు, పరుగులు చేసిన క్రీడాకారుడిగా ఖ్యాతి గడించాడు. కెప్టెన్‌ అజయ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలో వరుసగా మూడు రంజీ ట్రోఫీలు గెలిచిన జట్టులో గణేష్‌ ఆటతీరు కీలకంగా మారింది. అజయ్‌కుమార్‌రెడ్డి తనకు స్ఫూర్తి అని, ఇండియా జట్టుకు ఆడాలన్నదే తన లక్ష్యమని గణేష్‌ తెలిపాడు. సాధారణ క్రికెటర్లలాగే అంధ క్రికెటర్లను కూడా ప్రభుత్వాలు గుర్తించి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆదుకోవాలని కోరుతున్నాడు.  

గణేష్‌ సాధించిన విజయాలు 
2018 చెన్నైలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ఏపీ నుంచి పాల్గొని జట్టు విజయంలో కీలకంగా మారాడు.   
2018లో కోల్‌కత్తాలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ఆల్‌రౌండ్‌ ప్రతిభ కనబరిచి బంగారు పతకం అందుకున్నాడు.  
2019, 2020లో కేరళలో జరిగిన జాతీయ స్థాయి నగేష్‌ ట్రోఫీని ఆంధ్ర జట్టు కైవసం చేసుకోవడంలో కీలకంగా మారాడు.   
ఈ ఏడాది ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి క్రికెట్‌ పోటీల్లో ఆంధ్రా జట్టును విజయ తీరాలకు చేర్చాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement