హాంగ్‌కాంగ్ క్రికెట్ సిక్సెస్-2025 టోర్నమెంట్ నవంబర్ 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్ కోసం ఏడుగురు సభ్యులతో కూడిన ఆస్ట్రేలియా జట్టును సెలక్టర్లు ప్రకటించారు. ఈ జట్టు కెప్టెన్‌గా బిగ్ బాష్ లెజెండ్ అలెక్స్ రాస్ ఎంపికయ్యాడు. ఈ జట్టులో బెన్ మెక్‌డెర్మాట్, ఆండ్రూ టై, క్రిస్ గ్రీన్ వంటి అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లు సైతం ఉన్నారు.
క్రిస్ గ్రీన్‌కు కెప్టెన్‌గా అపారమైన అనుభవం ఉనప్పటికి రాస్‌కే జట్టు పగ్గాలను సెలక్టర్లు కట్టబెట్టారు. గతేడాది ఆస్ట్రేలియా సెమీఫైనల్లో పాక్ చేతిలో ఓటమి పాలైంది. దీంతో ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలని కంగారులు పట్టుదలతో ఉన్నారు. కాగా ఈవెంట్‌లో మొత్తం 12 జట్లు పాల్గొననున్నాయి.
ఆస్ట్రేలియా, భారత్, పాకిస్తాన్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, హాంకాంగ్, నేపాల్, ఒమన్, యూఏఈ జట్లు భాగం కానున్నాయి. నవంబర్ 7 నుంచి 9 వరకు టిన్ క్వాంగ్ రోడ్ రిక్రియేషన్ గ్రౌండ్‌లో జరగనుంది. ఈ సిక్సెస్ టోర్నీ కోసం భారత జట్టును ఇప్పటికే ప్రకటించారు. టీమిండియా కెప్టెన్ దినేష్ కార్తీక్ వ్యవహరించనున్నాడు.
హాంకాంగ్ క్రికెట్ సిక్సర్స్ కోసం ఆస్ట్రేలియా జట్టు:
అలెక్స్ రాస్ (కెప్టెన్), బెన్ మెక్‌డెర్మాట్, జాక్ వుడ్, నిక్ హాబ్సన్, క్రిస్ గ్రీన్, విలియం బోసిస్టో , ఆండ్రూ టై.
అసలేంటి హాంకాంగ్ సిక్సెస్?
1992లో హాంకాంగ్ క్రికెట్ ఆధ్వర్యంలో మొదలైన హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ.. చివరగా 2017 వరకు జరిగింది. ఆ తర్వాత కొన్ని కారణాలతో ఈ టోర్నీని నిర్వహించలేదు. అయితే ఈ ఈవెంట్‌కు మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు హాంకాంగ్ క్రికెట్ ముందుకు వచ్చింది. ఈ క్రమంలో ఏడేళ్ల తర్వాత ఈ టోర్నీని మళ్లీ నిర్వహించారు. గత సీజన్ విజేతగా శ్రీలంక నిలిచింది.
దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు అత్యధికంగా 5 సార్లు ఈ టోర్నమెంట్ విజేతలగా నిలవగా.. పాకిస్తాన్ 4 సార్లు, శ్రీలంక రెండు సార్లు ఈ హాంకాంగ్ సిక్సెస్ ట్రోఫీని ముద్దాడింది. భారత్, ఆస్ట్రేలియా, విండీస్ జట్లు చెరో ఒక్కసారి ఛాంపియన్స్‌గా నిలిచాయి. గతంలో ఈ టోర్నీలో సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, అనిల్ కుంబ్లే వంటి దిగ్గజ క్రికెటర్లు సైతం ఆడారు.
రూల్స్ ఇవే..
ఒక మ్యాచ్‌లో ప్రతీ జట్టు 6 ఓవర్లు మాత్రమే ఆడుతోంది. మ్యాచ్ ఆడే రెండు జట్లలో ఆరుగురు ఆటగాళ్లు ఉండాలి. గ్రూప్ దశలో ఒక్కో ఓవర్‌కు ఆరు బంతులు ఉంటాయి. అదే ఫైనల్‍లో ఒక్కో ఓవర్లో ఎనిమిది బంతులు ఉంటాయి. . వికెట్ కీపర్ మినహా జట్టులోని ప్రతి ఒక్కరు ఒక్కో ఓవర్ వేయాల్సి ఉంటుంది.
చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. వణికి పోయిన బౌలర్లు


