ఐపీఎల్ 2026 సీజన్ మరో వారం రోజుల్లో మొదలుకానుంది. కానీ ఐపీఎల్‌లో ఈసారి ఆటగాళ్ల గాయాల సమస్యలు పెరిగిపోయాయి. ముఖ్యంగా వేలంలో కోట్ల ధర పలికిన విదేశీ ఆటగాళ్లు గాయాలు, వ్యక్తిగత కారణాలతో లీగ్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానుండడం ఆయా ఫ్రాంచైజీలపై ప్రభావం చూపనుంది.
ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ వెన్ను గాయం నుంచి కోలుకోకపోవడంతో సీజన్ ఆరంభ మ్యాచ్‌లకు కమిన్స్ అందుబాటులో ఉండడం లేదు. దీంతో అతడి స్థానంలో ఇషాన్ కిషన్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తూ ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణయం తీసుకుంది. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ రాయల్‌చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ కూడా గాయంతో దూరమయ్యాడు.
తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు గాయాల బెడద తగిలింది. ఆ జట్టు స్టార్ మిచెల్ స్టార్క్ గాయంతో సీజన్ ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా క్రికెట్ ఆస్ట్రేలియాపై విమర్శలు చేశాడు. ‘మిచెల్ స్టార్క్ సీజన్ ఆరంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడం లేదని తెలిసింది. ఇప్పటికే జోష్ హాజిల్‌వుడ్, పాట్ కమిన్స్‌లు దూరమయ్యారు. తాజాగా స్టార్క్ గాయంతో బాధపడుతున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) పేర్కొంది.
కానీ నిజానికి అతను ఫిట్‌గా ఉన్నప్పటికీ సీఏ మాత్రం ఏవో సాకులు చెప్పి అతన్ని ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడకుండా చూస్తుంది. స్టార్క్ టీ20 క్రికెట్‌కు ఎప్పుడో వీడ్కోలు పలికాడు. మరి రెండు నెలలుగా స్టార్క్ విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా ఏం చేసినట్లు? అంతేకాదు స్టార్క్ యాషెస్ సిరీస్ తర్వాత మళ్లీ మ్యాచ్‌లు ఆడలేదు. అయితే భారత్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ నేపథ్యంలో మొదట విశ్రాంతి తీసుకోమని పేర్కొన్న సీఏ ఆ తర్వాత మాట మార్చి ఐపీఎల్‌కు అందుబాటులో ఉంటాడని తెలిపింది.
కానీ ఇప్పుడెందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కావడం లేదు. ఇక న్యూజిలాండ్ బౌలర్ లోకీ ఫెర్గూసన్ విషయం నన్ను మరింత ఆశ్చర్యపరుస్తోంది. గాయం లేనప్పటికీ కుటుంబంతో కొంత సమయం గడిపేందుకు ఫెర్గూసన్ ఐపీఎల్‌లో తొలి ఏడు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడం లేదని తెలిసింది. ఇది దారుణమైన అంశం.
ప్రస్తుతం ఫెర్గూసన్ సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతున్నాడు. అది ముగియగానే తన కుటుంబంతో గడిపేందుకు న్యూజిలాండ్ వెళ్లనున్నాడు. అది అతని వ్యక్తిగత విషయం కావొచ్చు, కానీ ఐపీఎల్‌లో ఒక జట్టుకు ఆడుతూ ఏడు మ్యాచ్‌ల తర్వాత జట్టులో చేరి రూ.కోటి తీసుకొని వెళ్లిపోతాడు. కానీ దీనివల్ల ఎవరికీ ప్రయోజనం? ప్రతీ ఐపీఎల్‌లో ఇది సర్వసాధారణంగా కనిపిస్తూనే ఉంది.’ అని వెల్లడించాడు.


