
ఢిల్లీ : టీమిండియా స్టార్ ఆటగాడు శిఖర్ ధావన్‌కు టెస్టుల్లో ఓపెనింగ్ చేసే అవకాశం భవిష్యత్తులో కష్టమేనంటూ భారత మాజీ టెస్టు ఓపెనర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే టీమిండియా మేనేజ్‌మెంట్ ఇప్పటికే రోహిత్ శర్మ నుంచి మొదలుకొని కేఎల్ రాహుల్, పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, మురళి విజయ్ వంటి ఆటగాళ్లను ఓపెనింగ్ స్థానంలో పరిక్షించింది. వీరిలో ప్రతీ ఒక్కరు ఏదో ఒక మ్యాచ్‌లో ఆకట్టుకున్నారే తప్ప ప్రతీ మ్యాచ్‌లో బాగా ఆడిన సందర్భాలు తక్కువే ఉన్నాయి.. వయసు రిత్యా చూస్తే మాత్రం ధవన్‌కు తక్కువ అవకాశాలు ఉన్నట్లు ఆకాశ్ పేర్కొన్నాడు.('ఫ్రీ బాల్ అవకాశం బౌలర్‌కు కూడా ఇవ్వాలి')
34 ఏళ్ల వయసు ఉన్న శిఖర్ ధావన్ మళ్లీ టెస్టు క్రికెట్ ఆడే అవకాశం ఉందా అంటూ నెటిజన్లు అడిగిన ప్రశ్నకు ఆకాశ్ తన యూట్యూబ్ చానెల్ ద్వారా సమాధానమిచ్చాడు. ' అవకాశం అనేది ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరు చెప్పలేరు. అయితే ఆ అవకాశం తొందరగా రావొచ్చు.. రాకపోవచ్చు. కానీ ధావన్ మళ్లీ టెస్టులు ఆడే అవకాశం ఇప్పట్లో లేనట్లే.. ఎందుకంటే జట్టు మేనేజ్‌మెంట్ ఇప్పటికే టెస్టు ఓపెనర్‌గా పలువురు ఆటగాళ్లను పరిక్షించింది. ధావన్ విఫలమైన తర్వాత రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా తమను తాము నిరూపించుకున్నారు. దీనిబట్టి చూస్తే ప్రస్తుతం అతను ఓపెనింగ్ అవకాశాల్లో 5వ స్థానంలో ఉన్నాడు.
వీరందరు విఫలమైతే తప్ప ధావన్‌కు అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది కష్టమే. వయసు రిత్యా చూసుకున్నా కూడా అవకావం లేదు.. కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి. అయితే టెస్టు క్రికెటర్‌గా అద్భుత రికార్డు ఉన్న ధావన్ ఇక వన్డే, టీ20లపై ఎక్కువ దృష్టి సారిస్తే మంచిది. రోహిత్, రాహుల్, మయాంక్, పృథ్వీ షాలు అతనికంటే ముందువరుసలో ఉన్నారు.' అంటూ చెప్పుకొచ్చాడు.
2013లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా శివర్ ధావన్ అరంగేట్రం చేశాడు. ఆరంభ మ్యాచ్‌లోనే 177 పరుగులు సాధించి ఔరా అనిపించాడు. టెస్టు ఓపెనర్‌గా మొత్తం 34 టెస్టుల్లో 40.61 సగటుతో 2,315 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు ఉన్నాయి. అయితే 2018 తర్వాత టెస్టుల్లో ధావన్ ప్రదర్శన అంతకంతకు దిగజారడంతో ఏకంగా జట్టులోనే చోటు కోల్పోవాల్సివచ్చింది. ఆ తర్వాత తిరిగి జట్టులోకి ఎంపిక కాలేదు. 2018 ఇంగ్లండ్ పర్యటనలో ఓవల్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ధావన్ చివరిసారిగా ఆడాడు.