IPL 2023: వరుసగా రెండు ఓటములు.. ఈసారి ట్రోఫీ సన్‌రైజర్స్‌దే.. అదెలా..?

In 2016 SRH Lost First 2 Matches And Won IPL Trophy, Will History Repeat - Sakshi

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2023లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తొలి రెండు మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. 2016 ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ ఇలాగే తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, ఆతర్వాత ఏకంగా టైటిల్‌ కైవసం చేసుకోవడంతో ఈ సారి కూడా అదే సీన్‌ రిపీట్‌ అవుతుందని ఆ జట్టు అభిమానులు అంచనా వేస్తున్నారు.

2016లో సన్‌రైజర్స్‌ తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో (45 పరుగుల తేడాతో), రెండో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చేతిలో (8 వికెట్ల తేడాతో) ఓటమిపాలు కాగా.. ప్రస్తుత ఎడిషన్‌లో ఆ జట్టు తొలి మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ చేతిలో (72 పరుగుల తేడాతో), రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ చేతిలో (5 వికెట్ల తేడాతో) పరాజయంపాలైంది.

కాగా, తొలి రెండు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్‌ ఘోర పరాజయాలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఆ జట్టు అభిమానులు ఈ విషయాన్ని హైలైట్‌ చేస్తూ ఊరట పొందుతున్నారు. కొత్త కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్క్రమ్‌ వచ్చాక అయినా సన్‌ 'రైజ్‌' అవుతుందని భావిస్తే.. అతను కూడా ఏమీ చేయలేకపోవడంతో (గోల్డెన్‌ డక్‌) కొందరు ఫ్యాన్స్‌ నిరాశలో కూరుకుపోయారు.

తదుపరి ఏప్రిల్‌ 9న పంజాబ్‌తో జరుగబోయే మ్యాచ్‌ నుంచి తమ విజయయాత్ర కొనసాగుతుందని మరికొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆరంభమే, ఇంకా బహుదూర ప్రయాణం సాగించాల్సి ఉంది, ఈ మధ్యలో ఏమైనా జరగవచ్చు, ఈసారి జట్టు కూడా పటిష్టంగా ఉందనుకుంటూ కొందరు హార్డ్‌కోర్‌ అభిమానులు తమను తాము తృప్తి పరుచుకుంటున్నారు. 

ఇదిలా ఉంటే, లక్నో సూపర్‌ జెయింట్స్‌తో నిన్న (ఏప్రిల్‌ 8) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌  అన్ని విభాగాల్లో ఘోరంగా విఫలమై దారుణ ఓటమిని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 121 పరుగుల అతి సాధారణ స్కోర్‌ చేసింది. కెప్టెన్‌ మార్క్రమ్‌ గోల్డన్‌ డకౌట్‌ కాగా.. 13.25 కోట్ల ఆటగాడు హ్యారీ​ బ్రూక్‌ (3) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విఫలమై దారుణంగా నిరాశపరిచాడు.

రాహుల్‌ త్రిపాఠి (41 బంతుల్లో 35), వాషింగ్టన్‌ సుందర్‌ (28 బంతుల్లో 16) టెస్ట్‌ మ్యాచ్‌ ఇన్నింగ్స్‌లు ఆడారు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఎల్‌ఎస్‌జే.. ఆడుతూ పాడుతూ విజయతీరాలకు (16 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 127) చేరింది. తొలుత బౌలింగ్‌లో (4-0-18-3) అదరగొట్టిన కృనాల్‌ పాండ్యా, ఆతర్వాత బ్యాటింగ్‌లోనూ (23 బంతుల్లో 34; 4 ఫోర్లు, సిక్స్‌) రెచ్చిపోయి ఒంటిచేత్తో తన జట్టును గెలిపించాడు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top