
ఫొటో క్రెడిట్ : wildlifetrusts.org
సృష్టిలోని మొక్కలు.. మానులు. తీగలు.. సర్వ జీవులకూ ఏదోరోజు.. అనారోగ్య పరిస్థితి ఎదురవుతుంది. దానికి రాళ్లు రప్పలు మినహా ప్రాణమున్న ఏ జీవీ అతీతం కాదు .. మినహాయింపు లేదు. కొన్నికొన్ని జీవులు తమకు వచ్చిన అనారోగ్యాన్ని, అస్వస్థతను తమతమ అలవాట్లను బట్టి మాన్పుకుంటాయి.. మళ్ళీ ఆరోగ్యాన్ని సంతరించుకుంటాయి. పులులు.. కుక్కలు.. చిరుతలు.. ఆవులవంటివి ఒంటిమీద గాయాలైతే వాటిలాలాజలంతోనే వాటిని తగ్గించుకుంటాయి.. నాలుకతో నాకడం ద్వారా గాయాన్ని నయం చేసుకుంటాయి.. మరి కాలజ్ఞానిగా పేరొందిన కాకికి ఒంట్లో బాలేకపోతే ఏం చేస్తుందో తెలుసా .. చీమలు ఎక్కువగా ఉన్న పుట్టదగ్గరకు వెళ్తుంది. అక్కడ చుట్టూ చీమలు ఉన్న స్థలాన్ని చూసుకుని తన కాళ్ళ చుట్టూ చేమలు ఉండేలా ప్లాన్ చేసుకుని అక్కడ కూర్చుంటుంది. కదలకుండా రెక్కలు చాచి నిలబడుతుంది..
ఒక్కో చీమా తన శరీరంలోకి చొరబడి కొడుతుంటాయి.. అయినా సరే కాకి ఏమాత్రం కదలిక లేకుండా నిలబడుతుంది. అతడు సినిమాలో బ్రహ్మానందం మాదిరి కమాన్.. హిట్.. హిట్ మీ యార్... అన్నట్లుగా కమాన్.. రండి.. కుట్టండి ... అందరూ కలిపి ఒకేసారి కుట్టండి అంటూ అలాగే ఉంటుంది తప్ప కదలదు.. మెదలదు.. అలా ఒకటి.. రెండు.. మూడు చీమలు కుడుతూనే ఉంటాయి.. చీమలు ఎంత ఎక్కువగా కుడితే కాకికి అంత నొప్పిగానూ ఉంటుంది.. అదే తరుణంలో అంత త్వరగా తన జ్వరం తగ్గిపోయి మళ్ళీ ఆకాశంలో రివ్వున ఎగిరేందుకు శక్తిని సంతరించుకుంటుంది. చూసారా నోరులేని జీవులు తామే సొంతంగా రోగాలను నయం చేసుకుంటున్నాయి. ప్రకృతి ఒక్కో జీవికి ఒక్కో విధమైన తెలివితేటలూ ఇచ్చాడు మరి..
దీని వెనుక ఒక గొప్ప సైన్స్ ఉంది.. కాకికి మాత్రమే తెలిసిన వైద్యం ఉంది.. చికిత్స ఉంది.. వాస్తవానికి చీమల్లో ఫార్మసిక్ యాసిడ్ ఉంటుంది.. అందుకే చీమలు కుడితే మనకు మంటగా ఉంటుంది. అయితే ఇదే యాసిడ్ కాకుల పాలిట మెడిసిన్ మాదిరి.. పని చేస్తుంది. చీమలు కుట్టడం ద్వారా కాకి శరీరంలోకి కొంత మొత్తంలో ఫార్మాసిక్ యాసిడ్ చేరుతుంది. ఇది శరీరంలోని వైరస్.. బాక్టీరియా ఇతర రోగకారక క్రిములకు నశింపజేస్తుంది. దీంతో మళ్ళీ కాకమ్మ శక్తిని సంతరించుకుంటుంది. ఈ గొప్ప వైద్య విధానాన్ని “ఆంటింగ్” అని పిలుస్తారు. కాకులే కాకుండా ఇంకా చాలా పక్షులు.. పాకే జీవుల్లో ఈ విధానం ఉందని జంతుశాస్త్రవేత్తలు అంటున్నారు.
:::సిమ్మాదిరప్పన్న