
మనుషుల్లో ఇంత మానవత్వమా ?
గాయపడిన ఆవును కొండలు.. గుట్టల్లో మోసుకుంటూ
అన్నదమ్ముల ప్రేమకు కరిగిపోయిన మూగ జీవం
రోజులు మారాయి.. మనిషన్నవాడు మాయమైపోతున్నాడు.. కన్న తల్లిదండ్రులనే ఆశ్రమాల్లో వదిలేస్తున్న వైనం.. ఆస్తికోసం.. డబ్బుకోసం కట్టుకున్నవాళ్లనే చంపుతున్న తీరు.. ఇక పెంచుకున్న మూగజీవాలకు కష్టం వస్తే ఊరవతల వదిలేస్తున్న తీరు.. కోట్ల ఆస్తులు తీసుకుని కన్నవాళ్లను రోడ్లమీదకు నెట్టేస్తున్న సంఘటనలు నిత్యం కళ్ళముందు తారాడుతూనే ఉన్నాయి. ఇలాంటి కఠినమైన రోజుల్లో హృదయాలను ద్రవింపజేసే ఒక గొప్ప మానవీయ సంఘటన సోషల్ మీడియాను కదిలిస్తోంది.
హిమాచల్ ప్రదేశ్ అంటేనే కొండలు గుట్టలు.. వాగులు వంకలతో ప్రకృతి రమణీయతను నింపుకుని సౌభాగ్యలక్ష్మి లా కనువిందు చేస్తుంది.. ఎప్పుడు మంచుకురుస్తుందో.. ఎప్పుడు వరదలు ముంచెత్తుతాయో తెలియదు. ఆ కొండలు గుట్టలు మనం పర్యాటకులమాదిరి చూడడానికి చాలా బావుంటుంది కానీ అక్కడే నివసించేవాళ్లకు అదొక దుర్భేద్యమైన ప్రదేశం. ఆ కొండల మాటున.. వాగుల చాటున పల్లెలు.. అందులోనే జీవనం. రోడ్డు సౌకర్యాలు సైతం అంతంతమాత్రం.. ఎవరికన్నా ఏదైనా అనారోగ్యం వస్తే ఇక దేవుణ్ణి ప్రార్థించడమే... అక్కడికి డాక్టర్ వెళ్లడం కూడా అసాధ్యం.. అలాంటిది వాళ్ళింట్లోని మూగ జీవాలను కానీ ఏదైనా కష్టం వస్తే అలా ఆకాశంకేసి చూడడం తప్ప దాన్ని కాపాడుకోవడం కష్టమే.. దాన్ని ఆస్పత్రికి తీసుకుపోలేం.. డాక్టర్లు దొరకరు.. ఇలాంటి గడ్డు పరిస్థితుల మధ్య ఓ ఇద్దరు అన్నదమ్ములు.. తమ ఇంట్లోని గోవును కాపాడుకునేందుకు పడిన కష్టం ఇప్పుడు అందర్నీ కదిలిస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు తమ జబ్బుపడిన 200 కిలోల ఆవును భుజాలపై మోస్తూ 3 కిలోమీటర్లు నిటారైన, ప్రమాదకరమైన పర్వత మార్గం గుండా ఆస్పత్రికి తీసుకెళ్లారు. సిర్మౌర్ జిల్లాలోని క్యాటిరి గ్రామానికి చెందిన ఆ అన్నదమ్ములు తమ ఆవును ఎలాగైనా బతికించుకోవడానికి తమ భుజాలను కావిడిగా మార్చి అవును ఆస్పత్రికి మోసుకెళ్లారు. ఈ వీడియోను ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇదీ చదవండి: ‘స్వీట్’ కపుల్ : ఐటీని వదిలేసి, లక్ష పెట్టుబడితో ఏడాదికి రూ. 2కోట్లు
“ఇది నిజమైన మానవత్వం” అంటూ ‘streetdogsofbombay’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఈ వీడియోను షేర్ చేయగా దానికి వందలాదిగా ప్రశంసలు.. అభినందనలు దక్కాయి.
అడుగుతీస్తే అడుగువేయలేని రాళ్ళ మార్గం.. బురద.. ఏమైనా తేడా వస్తే అలా లోయలోకి పడిపోయే ప్రమాదం.. అయినా వారు ఈ సవాళ్ళను లెక్కచేయకుండా గుట్టలు.. కొండలను దాటుకుంటూ అవును భుజాలు మార్చుకుంటూ ఆస్పత్రికి తీసుకెళ్ళరు. తనపట్ల వారు చూపిన ప్రేమకు గోమాత కళ్ళనిండా ఆర్తిని నింపుకుని వారిని చూస్తూ కృతజ్ఞత చాటుకున్నాది. -సిమ్మాదిరప్పన్న