 
													ఏఐ జమానాలో ఏది అసలైందో తెలుసుకోవడం చాలా కష్టతరంగా మారింది. దానికి వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారంతో తోడవ్వడంతో మరింత వేగంగా జనాల్లోకి వెళ్లిపోతోంది. దీంతో వాస్తవం ఏంటో తెలియకుండానే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా.. ఒక వ్యక్తి 10వేల ఓటర్‌కార్డుల పేరిట ఓ ప్రచారం విపరీతంగా జరుగుతోంది. వీడియోతో సహా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెతుత్తున్నాయి.
జరిగింది ఏంటి?.. 
పశ్చిమ బెంగాల్‌లోని నాదియా జిల్లా కల్యాణి టౌన్‌లోని మేజర్‌చర్ ప్రాంతంలో అక్టోబర్ 25వ తేదీన అనుమానాస్పదంగా ఓ వ్యక్తి సంచరిస్తూ కనిపించాడు. దీంతో ఇద్దరు యువకులు అతన్ని పట్టుకుని సంచి తెరిచి చూడగా.. అందులోంచి ఓటర్ ఐడీ కార్డులు బయటపడ్డాయి. ఆ సమయంలో తీసిన వీడియోనే అది. 
సో.మీ. ప్రచారం
ఒక వ్యక్తికి 10వేల ఓటర్ కార్డులు. అదసలు సాధ్యమేనా? అనేది పట్టించుకోకుండానే ప్రచారం చేసేస్తున్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వంలో పరిస్థితి అధ్వానంగా తయారైందన్నది ఆ వీడియో సారాంశం. నేరగాళ్లు ఫేక్ ఓటర్ ఐడీలతో రెచ్చిపోతున్నారని.. ఇది ప్రభుత్వం కాదని.. పశ్చిమ బెంగాల్‌ను పశ్చిమ బెంగాల్‌గా మార్చే ప్రయత్నమని తిట్టిపోస్తున్నారు. 
ఈ ఘటనపై సదరు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అవి 100–250 దాకా ఉన్నాయి. అందులో మూడు డిజిటల్ కార్డులు అస్సాం రాష్ట్రానికి చెందినవిగా ఉన్నాయి. మిగతావి కల్యాణి, చుట్టుపక్కల వార్డులకు చెందినవిగా తెలుస్తోంది. అవి నకిలీవా? అసలువేనా?.. వీటితో మోసానికి పాల్పడ్డారా? అని నిర్ధారించుకునే పనిలో ఉన్నారు. మరోవైపు ఎన్నికల కమిషన్ ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి విచారణ జరుపుతోంది.
ఫేక్ ప్రచారం 
అంటే.. పట్టుబడింది 250 ఓటర్‌కార్డులు. జాతీయ వార్త సంస్థలు కొన్ని ఆ విషయాన్ని ధృవీకరించాయి. అయితే అవి అసలువో.. నకిలీవో కూడా తెలియదు. కానీ,సోషల్ మీడియాలో కొందరు ఆ సంఖ్యను 10,000గా పేర్కొంటు ప్రచారానికి దిగారు. 
కొసమెరుపు.. 
2018లో బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్‌లో ఒక అపార్ట్‌మెంట్‌లో 10,000కు పైగా ఓటర్ ID కార్డులు లభ్యమయ్యాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే మునిరత్న నాయుడు హస్తం ఉందని, ఆ అపార్ట్‌మెంట్ ఆయన సిబ్బందినేనని ఆ సమయంలో బీజేపీ ఆరోపణలు గుప్పించింది. ఈ కేసుకు సంబంధించి ఆయనపై కేసు కూడా నమోదు అయ్యింది. భారీ సంఖ్యలో ఫేక్ ఓటర్ ఐడీలు బయటపడడంతో అక్కడి ఓటింగ్‌ను ఈసీ వాయిదా కూడా వేసింది. ఆ సమయంలో.. ఓటమి భయంతోనే సిద్ధరామయ్య ఇదంతా చేస్తున్నారని అమిత్ షా మండిపడ్డారు కూడా. అయితే వాయిదా అనంతరం జరిగిన ఎన్నికలోనూ మునిరత్న నాయుడు ఘన విజయం సాధించారు. ఇప్పుడు 10వేల ఓటర్‌కార్డుల పట్టివేత ప్రచారం నేపథ్యంలో ఈ అంశం మరోసారి చక్కర్లు కొడుతోంది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
