జిల్లావ్యాప్తంగా 2011 జనాభా లెక్కల ప్రకారం 10.12లక్షల జనాభా ఉన్నారు. జిల్లాలో మెదక్, కరీంనగర్, భువనగిరి మూడు లోక్‌సభ నియోజకవర్గాల్లో ఆరు అసెంబ్లీ నియోజవర్గాల్లోని పలు మండలాలున్నాయి. ఈ పునర్విభజనతో ఒకటే జిల్లాలో నియోజకవర్గం ఉండనుంది. మళ్లీ సిద్దిపేట లోక్‌సభ నియోజకవర్గంగా ఏర్పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. 1967 నుంచి 2008 వరకు సిద్దిపేట పార్లమెంట్ నియోజకవర్గం కొనసాగింది. 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రద్దు చేసి మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలో విలీనం చేశారు.
కొత్తగా అయితే కొమురవెల్లి/చేర్యాల
ప్రస్తుతం 26 మండలాలుండగా సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రాలుండగా జనగామ నియోజకవర్గంలో నాలుగు మండలాలు, మానకొండూరు నియోజకవర్గంలో ఒక మండలం జిల్లాలో ఉన్నాయి. అలాగే గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలోని పలు మండలాలు మెదక్ జిల్లాలో ఉన్నాయి. నాలుగు నియోజకవర్గాలూ జనరల్‌స్థానాలే ఉన్నాయి. హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలో ఉంది. అసెంబ్లీ నియోజకవర్గాలు సైతం 50% పెంపు అమలైతే 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో అసెంబ్లీ ఐదు నియోజకవర్గాలయ్యే అవకాశాలున్నాయి. దీంతో కొమురవెల్లి/ చేర్యాల కేంద్రంగా నూతనంగా నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశముంది. అలాగే పాత నియోజకవర్గాల్లో ఒకటి మహిళకు రిజర్వ్ అవుతుందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మారనున్న రాజకీయ సమీకరణలు
ఈ మార్పులతో జిల్లాలోని రాజకీయ సమీకరణలు సమూలంగా మారనున్నాయి. నియోజకవర్గాల సంఖ్య పెరిగితే జిల్లాలోని పాత సరిహద్దులు మారిపోతాయి. దీనివల్ల భౌగోళికంగా నియోజకవర్గాల స్వరూపం మారుతుంది. స్థానాల పెంపుతో రిజర్వేషన్ల ప్రక్రియలో భారీ మార్పులు వస్తాయి. మరో 25 ఏళ్ల వరకు ఇదే రిజర్వేషన్ కొనసాగే విధంగా ఫ్రీజింగ్ అమల్లో ఉండనుంది. జిల్లాలో ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీ అయిన, మహిళ రిజర్వ్ స్థానం వచ్చే అవకాశాలున్నాయి. నియోజకవర్గాల మార్పుతో ప్రస్తుత ఎమ్మెల్యేల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంటుంది. తమ సొంత కేడర్ ఉన్న మండలాలు వేరే నియోజకవర్గంలోకి వెళ్తే సిట్టింగ్‌లు ఇబ్బంది పడతారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ఆశావహుల ఆశలు గల్లంతయ్యే ప్రమాదమూ ఉంది. నియోజకవర్గం రెండుగా చీలిపోవడం వల్ల పట్టున్న ప్రాంతం చేజారిపోవచ్చు. కొత్త రిజర్వేషన్ల వల్ల సీటు దక్కని పరిస్థితి ఎదురవుతుంది. డీలిమిటేషన్‌తో కొత్తవారికి అవకాశాలు రానున్నాయి. పునర్విభజన ఎలా ఉంటుందో అని రాజకీయ నేతలు ఆందోళన మొదలైంది.
నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ నెల 30 నుంచి జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో లోక్‌సభ నియోజకవర్గాల డీలిమిటేషన్, మహిళకు 33% రిజర్వేషన్ బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపింది. దీంతో జిల్లాలో ఒక్కసారిగా నియోజకవర్గాల అంశం తెరపైకి వచ్చింది. పునర్విభజన జరిగితే జిల్లా అంతటా కలిపి ఒకే లోక్‌సభగా ఏర్పడనుంది. అలాగే అసెంబ్లీ స్థానాలు 50% పెంపు ప్రతిపాదన అమలైతే జిల్లాలో ఒక అసెంబ్లీ నియోజకవర్గం పెరిగే అవకాశముంది.
– సాక్షి, సిద్దిపేట
మళ్లీ సిద్దిపేట లోక్‌సభ స్థానం ఏర్పాటు!
జిల్లాలో ఐదుకు పెరగనున్న అసెంబ్లీ స్థానాలు!
కొత్తగా కొమురవెల్లి/చేర్యాల అసెంబ్లీ స్థానాలు!
జిల్లాలో మారనున్న రాజకీయ సమీకరణలు


