మిరుదొడ్డి(దుబ్బాక): ఎల్‌నినో నేపథ్యంలో వచ్చే వేసవిలో తాగు నీటి కొరత అధికంగా ఉండే అవకాశాలున్నాయని, తాగు నీటి ఎద్దడి రాకుండా ప్రభుత్వం అన్ని విధాలా ముందస్తు చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ హైమావతి తెలిపారు. శనివారం మండల పరిధిలోని కొండాపూర్‌లో నిర్వహిస్తున్న భూ భారతి రీ సర్వే ప్రక్రియను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...ఎల్‌నినోను దృష్టిలో పెట్టుకుని సాగునీటి వనరులు అందుబాటులో ఉన్న రైతులు వరి సాగు చేయవద్దన్నారు. భూ గర్భజలాలు అడుగంటి కరెంట్ కోతలు కూడా ఉండే అవకాశాలున్నాయని చెప్పారు. ఎకరం వరికి సరిపోయే సాగు నీటితో 10 ఎకరాలకు పైగా ఆరుతడి పంటలను సాగు చేసి ఆర్థిక ఆదాయం సాధించాలని రైతులకు సూచించారు. భూ రీ సర్వేతో భూములకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. భూమి రీ సర్వే పూర్తయిన వెంటనే ఎలాంటి సందేహాలున్నా మళ్లీ వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. అటవీ, ఇరిగేషన్ భూములు, గ్రామ సరిహద్దులు, రహదారు లను సర్వే చేసి రికార్డుల్లో నమోదు చేస్తామన్నారు.
పారదర్శకంగా నిర్వహించాలి
సిద్దిపేటరూరల్/సిద్దిపేటఅర్బన్: భూముల రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ హైమావతి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హల్‌లో రెవెన్యూ అధికారులతో భూ భారతి రీ సర్వే పురోగతిపై కలెక్టర్ కె.హైమావతి, జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీ కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ....మండలాల వారీగా రీ సర్వే పనుల పురోగతి, భూముల వివరాల నమోదు, భూ రికార్డుల పరిశీలన, సర్వేలో ఎదురవుతున్న సమస్యలు, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై సమీక్షించారు. రీ సర్వే ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా క్షేత్రస్థాయిలో భూముల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.
కలెక్టర్ హైమావతి


