విలీనం వద్దే వద్దు | - | Sakshi
Sakshi News home page

విలీనం వద్దే వద్దు

Nov 29 2026 11:47 AM | Updated on Nov 29 2026 11:47 AM

● వ్యతిరేకిస్తూ సభ్యుల ఏకగ్రీవ తీర్మానం ● ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌

డీసీఎంఎస్‌ను మార్క్‌ఫెడ్‌లో విలీనం చేస్తూ నోటిఫికేషన్‌ జారీ

ఉమ్మడి మెదక్‌ జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌)ని మార్క్‌ఫెడ్‌లో విలీనం చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డీసీసీబీ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. శనివారం నిర్వహించిన సమావేశానికి సుమారు 80 మంది సభ్యులు హాజరు కాగా.. వీరందరూ విలీన నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఈ మేరకు తీర్మానం చేసి అదనపు కలెక్టర్‌, పర్సన్‌ ఇన్‌చార్జి సంగీతకు అందజేశారు.

– సాక్షిప్రతినిధి, సంగారెడ్డి

రాష్ట్రవ్యాప్తంగా డీసీసీబీలను మార్కెఫెడ్‌లో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా సంగారెడ్డి డీసీఎంఎస్‌ను కూడా విలీనం చేస్తూ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ మేరకు తీర్మానం పంపాలని ఆదేశించింది. ఈ మేరకు జిల్లా అదనపు కలెక్టర్‌ సంగీత శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా డీసీఎంఎస్‌ చైర్మన్‌ మల్కాపురం శివకుమార్‌ మాట్లాడుతూ.. విలీన నిర్ణయాన్ని ఉప సంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. రైతులకు నిరంతరం సేవలందిస్తూ లాభాల్లో ఉన్న సంస్థను నష్టాల ఊబిలో కూరుకుపోయిన మార్క్‌ఫెడ్‌లో విలీనం చేయడం తగదన్నారు.

ప్రభుత్వం చూపుతున్న కారణాలివే..

ప్రభుత్వం జారీ చేసిన విలీన నోటిఫికేషన్‌ పలు కారణాలను చూపింది. డీసీఎంఎస్‌ ఆశించిన స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించడం లేదని, 2024–25 ఆర్థిక సంవత్సరంలో వార్షిక నిర్వహణ వ్యయం రూ.26,74,939గా ఉందని, వరి కొనుగోలు కేంద్రాల నిర్వహణ మినహా సొంతంగా మార్కెటింగ్‌ కార్యకలాపాలు చేపట్టడం లేదని చెప్పింది. డీసీఎంఎస్‌, మార్క్‌ఫెడ్‌ రెండు సంస్థల లక్ష్యాలు ఒకే విధంగా ఉన్నందున పరిపాలనా సౌలభ్యం కలుగుతుందని తెలిపింది. విలీనం ద్వారా పరిపాలన వ్యయం తగ్గడంతో పాటు, రైతులకు మెరుగైన సేవలందించవచ్చని పేర్కొంది.

అభ్యంతరాల స్వీకరణ

నోటిఫికేషన్‌పై ఏమైనా అభ్యంతరాలుంటే 21 రోజుల్లో తెలియజేయాలని ప్రభుత్వం తెలిపింది. డీసీఎంఎస్‌ సభ్యులు, డిపాజిటర్లు, రుణదాతలు, ఉద్యోగులు, ఇతర సంబంధిత వ్యక్తులు అభ్యంతరాలు, సూచనలు తెలియజేయవచ్చని పేర్కొంది.

ఆస్తులన్నీ మార్క్‌ఫెడ్‌కే..

విలీన నిర్ణయంతో డీసీఎంఎస్‌ ఆస్తులన్నీ మార్క్‌ఫెడ్‌కు బదలాయింపు జరుగుతుందని నోటిఫికేషన్‌లో పేర్కొంది. అలాగే సంస్థ అప్పు లు, బాధ్యతలు, ఉద్యోగులు, కాంట్రాక్టు ఒప్పందాలు, రావాల్సిన బకాయిలు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొసీడింగ్స్‌, క్రిమినల్‌ కేసులు, ఇతర న్యాయపరమైన వ్యవహరాలన్నీ మార్క్‌ఫెడ్‌కు బదలాయించనున్నట్లు ప్రతిపాదించారు. డీసీ ఎంఎస్‌కు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రూ.వందల కోట్లు విలువ చేసే స్థిర, చరాస్తులు ఉన్నాయి. జహీరాబాద్‌లో షాపింగ్‌ కాంప్లెక్స్‌, గోదాం, మెదక్‌, సదాశివపేట, శివంపేట, గజ్వేల్‌, చిట్టాపూర్‌, మంబోజీపేట్‌లలో గోదాంలు ఉన్నాయి. అలాగే పలు చోట్ల విలువైన ఖాళీ స్థలాలున్నాయి. వీటిపై అద్దెలు, ఇతర రూపాల్లో రూ.లక్షల్లో ఆదాయం లభిస్తుంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ రూ.1.10 కోట్ల మేరకు లభాలను ఆర్జించింది. ఇప్పుడు విలీన నిర్ణయంతో లాభాల్లో ఉన్న ఈ సంస్థ నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న మార్క్‌ఫెడ్‌కు ఎలా విలీనం చేస్తారని సభ్యులు మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement