● డీఐఈఓ రవీందర్‌రెడ్డి
● జిల్లాస్థాయి బాలికల కబడ్డీ పోటీలు ప్రారంభం
సిద్దిపేటఎడ్యుకేషన్: విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడుతాయని జిల్లా ఇంటర్ విద్యాధికారి, ఎస్‌జీఎఫ్ అండర్ 19 జిల్లా చైర్మన్ రవీందర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల (కోఎడ్యుకేషన్)లో అండర్–19 ఎస్‌జీఎఫ్ జిల్లాస్థాయి బాలికల కబడ్డీ క్రీడా ఎంపిక పోటీలను జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ సమ్మయ్య, ప్రిన్సిపాల్ ప్రమీలతో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. క్రీడలతో విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, నాయకత్వ లక్షణాలు, జట్టు స్ఫూర్తి పెంపొందుతాయన్నారు. చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తూ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులకు సూచించారు. అనంతరం పోటీలకు హాజరైన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. వారితో ఆత్మీయంగా ముచ్చటించి క్రీడలపై ఆసక్తి, శిక్షణ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని జూనియర్ కళాశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ పాఠశాలల బాలికల జట్లు పాల్గొని హోరాహోరీగా తలపడ్డాయి. కార్యక్రమంలో కబడ్డీ కోచ్ వెంకటేశ్, వ్యాయామ ఉపాధ్యాయులు దేవరాజు, శారద, నరేశ్, వెంకటసాయి, సంజీవ్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.


