కరీంనగర్ రీజియన్ నుంచి మెదక్ రీజియన్‌లోకి ఆందోళనలో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు తెరపైకి హుస్నాబాద్ విలీన ప్రక్రియ వదంతులు నమ్మొద్దంటున్న అధికారులు
233 మంది ఉద్యోగులు.. 44 బస్సులు
హుస్నాబాద్: కరీంనగర్ రీజియన్ పరిధిలో ఉన్నప్పుడు ఏదైనా పని కోసం రీజినల్ మేనేజర్ కార్యాలయానికి వెళ్లాలంటే కేవలం 40 కి.మీ దూరం ఉండేది. ప్రస్తుతం మెదక్ వెళ్లాలంటే దాదాపు 100 కి.మీ. దూరం వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతీ నెల ఆడిట్, ఏదైనా కేసుల విషయంలో అప్పీలు చేయాలన్నా, కార్మికుల సమస్యలు, డిపో మెయింటనెన్స్ ఇలా ప్రతీ విషయంలో ఆర్‌ఎం ఆఫీస్‌కు వెళ్లాల్సి ఉంటుంది. బస్సులకు సంబంధించి నట్లు, బోల్టులు ఇతరత్రా సామగ్రి ఇండెంట్ కోసం మెదక్ వెళ్లాలంటే సమయం వృథా అవుతుంది. పని కాకుంటే అక్కడే మరో రోజు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా పాలనాసౌలభ్యం కోసం ఆర్టీసీ డిపోలను ఒకే జిల్లా, ఒకే రీజియన్ పరిధిలో చేరుస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం హుస్నాబాద్ ఆర్టీసీ డిపో తప్ప, అన్ని శాఖల కార్యకలాపాలు సిద్దిపేట జిల్లా పరిధిలో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మెదక్ రీజియన్ పరిధిలోకి హుస్నాబాద్ ఆర్టీసీ డిపోను విలీనం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే హుస్నాబాద్ డిపోను మెదక్ రీజియన్‌లో కలపవద్దని, యథావిధిగా కరీంనగర్‌లోనే ఉంచాలని ఆర్టీసీ కార్మికులు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు విన్నవించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఆర్టీసీ విలీనం అంశంపై ఫోన్‌లో మాట్లాడి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో హుస్నాబాద్ డిపోను కరీంనగర్ రీజియన్ పరిధిలోనే ఉంచాలని కరాఖండిగా చెప్పినట్లు సమాచారం.
హుస్నాబాద్‌ను కరీంనగర్ జిల్లాలో కలపాలని ఎప్పటి నుంచో ఇక్కడి ప్రజల డిమాండ్ ఉంది. శాసనసభ ఎన్నికల ప్రచారంలో హుస్నాబాద్‌కు వచ్చిన అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హుస్నాబాద్‌ను కరీంనగర్ జిల్లాలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నినాదంతోనే పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేగా, మంత్రి అయ్యారు. ప్రస్తుతం కరీంనగర్‌లో ఉన్న ఆర్టీసీ డిపోను మెదక్ రీజియన్‌లో విలీనం చేశారనే ప్రచారంతో హుస్నాబాద్ విలీన ప్రక్రియ మళ్లీ చర్చకు దారితీస్తోంది. కరీంనగర్‌లో ఉన్న డిపోను మెదక్ రీజియన్‌లో కలుపుతారనే ప్రచారంతో, విలీన ప్రక్రియపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మెదక్ రీజియన్‌లోకి హుస్నాబాద్ ఆర్టీసీ డిపో!
జిల్లాల పునర్విభజన నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో ఉన్న హుస్నాబాద్‌ను సిద్దిపేట జిల్లాలో విలీనం చేశారు. ఈ నేపథ్యంలోనే హుస్నాబాద్ ఆర్టీసీ డిపోను మెదక్ (సంగారెడ్డి) రీజియన్‌లోకి మార్చారు. ఇక్కడి ఉద్యోగులు, కార్మికులు ప్రతీ పనికి దాదాపు వంద కిలో మీటర్ల దూరంలో ఉన్న సంగారెడ్డిలోని ఆర్‌ఎం ఆఫీస్‌కు వెళ్లి రావాలంటే ఒక్క రోజు సమయం పట్టేది. కార్మికుల ఒత్తిడి మేరకు మళ్లీ హుస్నాబాద్ డిపోను కరీంనగర్ రీజియన్‌లోకి మార్చారు. కరీంనగర్‌లోకి మార్చారనే సంతోషం ముణ్నాళ్ల ముచ్చటగానే మారింది. మళ్లీ హుస్నాబాద్ ఆర్టీసీ డిపోను మెదక్ రీజియన్‌లోకి మార్చారనే ప్రచారంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు.
హుస్నాబాద్ ఆర్టీసీ డిపోలో 44 ఆర్టీసీ బస్సులు, 22 అద్దె బస్సులున్నాయి. 233 మంది ఉద్యోగులు, 25 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. డిపోలోని బస్సులు ప్రతీ రోజు 26 వేల కిలో మీటర్లు, రూ.15లక్షల కలెక్షన్ వస్తోందని అంచనా.
అధికారికంగా ఉత్తర్వులు రాలేదు
హుస్నాబాద్ ఆర్టీసీ డిపోను మెదక్ రీజియన్‌లోకి విలీనం చేసినట్లుగా అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. విలీన ప్రక్రియపై సమాచారం లేదు. ప్రస్తుతం డిపో కరీంనగర్ రీజియన్‌లోనే కొనసాగుతుంది. విలీనం అయినట్లు జరుగుతున్న ప్రచారం ఎవరు నమ్మొద్దు.
–వెంకన్న,
ఆర్టీసీ డిపో మేనేజర్, హుస్నాబాద్


