కొమురవెల్లి(సిద్దిపేట): కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేమార్గంలో కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ సమీపంలో నిర్మించిన రైల్వేస్టేషన్‌ను ఈ నెల 26న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా గురువారం దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్టేషన్‌లో బుకింగ్ కౌంటర్, ప్లాట్‌ఫాం, ప్రయాణికులకు అవసరమైన వసతులు, ప్రా రంభోత్సవ సమయంలో నాయకులు ఏర్పాటు చేసే సమావేశం, పార్కింగ్ కోసం స్థల పరిశీలన, భద్రత ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్యక్రమంలో సీపీఆర్‌ఓ శ్రీధర్, ఏడీఆర్‌ఎం రామారావు, సీనియర్ డెన్ ప్రసాద్, సీనియర్ సీసీఎం అనిరుధ్, ఏఎస్‌సీ రవిశర్మ, సీనియర్ డీఓఎం విద్యాధర్, సృజనకుమార్, నవ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు పెంచాలి
మల్లంపల్లి పాఠశాలను సందర్శించిన డీఈఓ
అక్కన్నపేట(హుస్నాబాద్): ప్రభుత్వ పాఠశాలలకు ప్రతీ రోజూ పిల్లలు వచ్చేలా చూడాలని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను డీఈఓ రమేశ్ ఆదేశించారు. అక్కన్నపేట మండలం మల్లంపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం అమలు తీరును విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా రాగి జావా, కోడిగుడ్లు ప్రోటీన్‌ను అందజేస్తాయని విద్యార్థులకు సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...పాఠశాలలకు రాని పిల్లల ఇళ్లకు ఉపాధ్యాయులు వెళ్లి వారి తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థులను వెంట పెట్టుకుని బడులకు తీసుకురావాలన్నారు. అలాగే తరగతి గదిలో విద్యార్థులను వివిధ సబ్జెక్ట్‌లలో సామర్థ్యాలపై ప్రశ్నలు అడుగుతూ వారి ప్రతిభను గమనించారు. కార్యక్రమంలో ఎంఈఓ గుగులోతు రంగానాయక్, ఉపాధ్యాయులు సర్వన్‌నాయక్‌తోపాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సమీకృత భవనం
పూర్తి చేయండి: బీఆర్‌ఎస్
హుస్నాబాద్: హుస్నాబాద్ పట్టణంలోని పాత తహసీల్దార్ కార్యాలయ స్థలంలో పెండింగ్‌లో ఉన్న శాకాహార, మాంసాహార భవన నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. అసంపూర్తిగా ఉన్న సమీకృత భవనం ఎదుట చేపల వ్యాపారులతో కలిసి గురువారం బీఆర్‌ఎస్ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ..గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన శాకాహార, మాంసాహార భవన నిర్మాణ పనులకు నిధులు కేటాయించకుండా వివక్ష చూపుతున్నారన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. చేపలు అమ్ముకునే వ్యాపారులకు మున్సిపల్ అధికారులు కనీస సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. ఈ భవనం పూర్తిచేస్తే చేపల వ్యాపారులకు కొంత వరకు మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు అయిలేని మల్లికార్జున్‌రెడ్డి, చిత్తారి శ్రీనివాస్, వికాస్‌యాదవ్, యాస శ్రీనివాస్ తదితరులున్నారు.
విద్యార్థులను
రెచ్చగొడుతున్న రాహుల్
బీజేపీ జిల్లా నాయకుడు శ్రీనివాస్
మిరుదొడ్డి(దుబ్బాక): కాంగ్రెస్ ఉనికిని చాటుకోవడం కోసం ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విద్యార్థులను రెచ్చగొడుతున్నారని బీజేపీ జిల్లా సీనియర్ నేత కానుగంటి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులతో కలిసి మిరుదొడ్డిలో గురువారం రాహుల్‌గాంధీ దిష్టి బొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ఔనత్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న రాహుల్ గాంధీ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారన్నారు. ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మోదీ ప్రభుత్వంపై విద్యార్థులను ఉసిగొల్పి పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కరుణాకర్, వార్డు సభ్యులు లింగాల సదానందరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ నాయకులు రమేశ్, స్వామి, ఎల్లం పాల్గొన్నారు.


