నామినేటెడ్ ఆశలు
రెండేళ్లుగా కాంగ్రెస్ నేతల ఎదురుచూపులు గ్రంథాలయ సంస్థ, సుడా చైర్మన్ పదవులు ఖాళీ ఇప్పటివరకు భర్తీకాని ‘సిద్దిపేట’ మార్కెట్ పదవులు కీలక నేతల చుట్టూ ప్రదక్షిణలు
మరోసారి తెరపైకి అంశం
జిల్లాలో గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక నియోజకవర్గాల్లోని మార్కెట్ కమిటీలు మాత్రమే భర్తీ కాగా సిద్దిపేట నియోజకవర్గం పరిధిలోని మార్కెట్ కమిటీలను ఇప్పటి వరకు నియమించలేదు. పైగా జిల్లాకు ఒక్క రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టు దక్కలేదు. స్థానిక నేతల నామినేటెడ్ పదవు లు కల నెరవేరడం లేదు. నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడంతో పదవులు ఆశిస్తున్న వారిలో ఆశలు రేకెత్తుతున్నాయి.
గ్రంథాలయ చైర్మన్ రాజీనామాతో..
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవికి కేడల లింగమూర్తి రాజీనామా చేశారు. మరో 8 నెలల పదవీ కాలం ఉండగానే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు చైర్మన్ పదవిని వదులుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిప్పటి నుంచి సుడా (సిద్దిపేట అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) చైర్మన్ పదవిని భర్తీ చేయలేదు. దీంతో రెండు జిల్లా స్థాయి నామినేటెడ్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.
రాష్ట్ర స్థాయిలో పదవేదీ?
రాష్ట్ర ప్రభుత్వం 22 నెలల క్రితం ఒకే సారి 34 మందికి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులు ఇచ్చారు. వీటిలో ఒక్క పదవి సైతం జిల్లాకు దక్కలేదు. జిల్లా నుంచి చాలా మంది కాంగ్రెస్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. మరో రెండు నెలలైతే ఆ పదవుల పదవీకాలం ముగియనున్నాయి. త్వరలో నియమించే రాష్ట్ర చైర్మన్ పోస్టులలో జిల్లాకు చెందిన నేతలకు అవకాశం కల్పించాలని పలువురు కోరుతున్నారు.
పైరవీల జోరు
ఇటీవల కాంగ్రెస్ హైకమాండ్‌కు నామినేటెడ్ పోస్టుల గురించి మీనాక్షి నటరాజన్ నివేదిక అందజేసినట్లు తెలిసింది. దీంతో నామినేటెడ్ పదవులను భర్తీ చేసే అవకాశాలు ఉండటంతో జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుల్లో ఆశలు నెలకొన్నాయి. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ నాయకులు నామినేటెడ్ పోస్టుల కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. కొన్నేళ్లుగా పార్టీ జెండా మోస్తున్నారు. పార్టీ అధికారంలోకి రావడంతో నామినేటెడ్ పోస్టులు దక్కుతాయని పలువురు నేతలు సంతోషించారు. రెండేళ్లుగా గంపెడాశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంతో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. – సాక్షి, సిద్దిపేట
మార్కెట్ కమిటీలకు సిఫార్సు చేశారా?
జిల్లాలో సిద్దిపేట నియోజకవర్గం పరిధిలోని మార్కెట్ కమిటీలు కాకుండా మిగతా ప్రాంతాల్లోని మార్కెట్ కమిటీలను నియమించారు. సిద్దిపేట నియోజకవర్గంలో సిద్దిపేట, నంగునూరు. చిన్నకోడూరు మార్కెట్‌లుండగా వీటి కమిటీల కోసం పేర్లను కాంగ్రెస్ పార్టీ సిఫార్సు చేయలేదా?.. చేసినా మార్కెటింగ్ శాఖ పెండింగ్‌లో పెట్టిందా? లేదంటే ఎవరైనా అడ్డుకుంటున్నారా? అని విషయంపై పలువురు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మార్కెట్ కమిటీని నియమిస్తే ఇప్పటి వరకు ఒక టర్మ్ ముగిసిపోయేది. మొదటి విడతలో కొందరికి.. రెండో విడతలో మరి కొందరికి పదవులు పొందేవారని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.


