● అంతంత మాత్రంగానే వైద్య సేవలు ● సమస్యల నిలయాలుగా ఆరోగ్య కేంద్రాలు ● వేధిస్తున్న సిబ్బంది కొరత
జహీరాబాద్ టౌన్: పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన బస్తీ దవాఖానాల్లో వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. దారిద్య్ర రేఖకు దిగువనున్న హమాలీ కాలనీ, గడీ తదితర ప్రాంతాల్లో పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలు మౌలిక వసతుల లేమితో కునారిల్లుతున్నాయి. పాలకుల శ్రద్ధ లోపించడం, అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కరువవటంతో ఆయా దవాఖానాల్లో వైద్య సేవలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా బస్తీ దవాఖానాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉండగా..సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. నిబంధనల ప్రకారం ప్రతీ బస్తీ దవాఖానాలో వైద్యుడితోపాటు నర్సు, అటెండర్, స్వీపర్ అందుబాటులో ఉండాలి. కానీ, ఇక్కడ కేవలం వైద్యుడు, నర్సు మాత్రమే పనిచేస్తుండటంతో పారిశుద్ధ్యం సహా ఇతర పనుల నిర్వహణ పడకేసింది. సరైన మోతాదులో మందులు కూడా అందుబాటులో లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. పరిసరాల అపరిశుభ్రత..పశువులు, కుక్కల స్వైరవిహారం, దవాఖానాల చుట్టూ మురుగునీరు చేరి ఈగలు, దోమలకు నిలయంగా మారాయి. దీంతో ఆస్పత్రికి రావాలంటేనే బాధితులు జంకుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బస్తీ దవాఖానాలలో పూర్తిస్థాయి సిబ్బందిని నియమించి, సేవలు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.


