కేరళంలో అల్లం పంట అత్యధికంగా సాగువుతోంది. ఈ ఏడాది వర్షాలు లేని కారణంగా భూగర్భజలాలు పడిపోతుండడంతో అక్కడి రైతులు భూమిలో నుంచి పంటను తీసి తరలిస్తుండడం వల్లే అల్లం ధర క్రమంగా దిగివస్తున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. కేరళంలో జనవరి, ఫిబ్రవరిలో అల్లం పంట సాగు చేస్తారు. దీంతో అక్కడ పంట చేతికి అందివచ్చింది. పంట సాగు విస్తీర్ణం అధికంగా ఉండడం, నీటి వనరులు పడిపోతుండడంతో లేతగా ఉన్న పంటను మార్కెట్‌కు తరలించుకుంటున్నారు. పంటను భూమిలో నిల్వచేయాలన్నా నీటి సదుపాయాలు లేనందునే లేత అల్లం ఉత్పత్తులను హైదరాబాద్ మార్కెట్‌కు తరలించడం వల్ల ధర పడిపోతున్నట్లు రైతులు వివరిస్తున్నారు.
2 వేల ఎకరాల్లో సాగు
జిల్లాలో సుమారు 2 వేల ఎకరాల్లో అల్లం పంట సాగైనట్లు సమాచారం. మే, జూన్ మాసాల్లో పంటను సాగు చేశారు. మార్కెల్లో విత్తనం ధర తక్కువ ఉండడంతో రైతులు పంట సాగు పట్ల ఆసక్తి చూపారు. అయితే ఈ ఏడాది అల్లం పంట సాగు చేసినా తగినంత మేర వర్షాలు లేని కారణంగా పంట ఆశాజనకంగా లేనట్లు రైతులు పేర్కొంటున్నారు. పంట ఎదగకపోవడం వల్ల దిగుబడులపై తీవ్ర ప్రభావం చూసే అవకాశం ఉందంటున్నారు. దిగుబడులు పడిపోయి, గిట్టుబాటు ధర లభించని పరిస్థితి వస్తే న ష్టాలు తప్పవనే ఆందోళన వారిని వెంటాడుతోంది. కాగా, పక్కనే ఉన్న కర్షాటక మహారాష్ట్రలతో పాటు కేరళం, అస్సాం, ఒరిస్సా రాష్ట్రాల్లో పంట సాగు చేశా రు. దీంతో భవిష్యత్తులో గిట్టుబాటు ధర లభిస్తుందో లేదో అని రైతులు ఆందోళన చెందుతున్నారు.
గతేడాది నష్టాలను చవిచూసిన రైతులు
గత ఏడాది వర్షాలు అధికంగా కురియడంతో పంటలు దెబ్బతినడంతో పెట్టుబడులు తిరిగి రాక రైతులు నష్టపోయారు. ఎకరాపై సుమారు రూ.2లక్షల మేర నష్టాలను చవి చూశారు. పెట్టుబడుల కోసం దొరికిన చోటల్లా అప్పులు చేశారు. పంట సాగుపై ఆశలు వదులు కోక తిరిగి పంట సాగు వైపు మొగ్గు చూపారు.
ఒక్కసారిగా అల్లం ధర పెరిగి రైతులను ఆనందానికి గురి చేసింది. తీరా ధర పడిపోతుండడం వారిని ఆందోళనకు గురి చేస్తోంది. జూన్ 15 నుంచి జూలై 15 వరకు క్వింటాల్ రూ.12 వేల మేర అమ్మకాలు జరిగాయి. ధర పెరగడంతో రైతులు భూమిలో నుంచి పంటను తీసి అమ్ముకున్నారు. ఇంకా ధర పెరిగే అవకాశం ఉందనే ఆశతో కొందరు పంటను అలాగే భూమిలో ఉంచారు. ఇంకా సుమారు 200 ఎకరాల్లో పంట నిల్వలు ఉన్నాయి. తీరా క్రమంగా ధర దిగుతూ వస్తోంది. ప్రస్తుతం క్వింటాల్ రూ.8 వేల నుంచి రూ.9 వేలు పలుకుతోంది. – జహీరాబాద్
కేరళం ఉత్పత్తుల రాకతో క్రమంగా పడిపోతున్న ధర
వర్షాలు లేక పంట ఎదుగుదల అంతంతే..
ఆందోళనలో అన్నదాతలు


