● బైరాన్‌పల్లి గ్రామాభివృద్ధికి కృషి
● జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
మద్దూరు(హుస్నాబాద్): రజాకార్ల రాక్షసత్వాన్ని ఎదిరించిన గ్రామం వీర బైరాన్‌పల్లి అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. గురువారం దూల్మిట్ట మండలం బైరాన్‌పల్లిలో స్తూపం, బురుజు వద్ద అమరవీరులకు పూలమాల వేసి నివాళుర్పించారు. గ్రామ సర్పంచ్ బర్మ రాజమల్లయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బైరాన్‌పల్లి పోరాటం ఒక్క గ్రామానికి పరిమితమైనది కాదన్నారు. మద్దూరు, లింగాపూర్, కూటిగల్, బెక్కల్, దూల్మిట్ట తదితర చుట్టూ పక్కల గ్రామాల ప్రజలను రజాకార్ల దాడుల నుంచి రక్షించడంలో బైరాన్‌పల్లి యువకులు కీలక పాత్ర పోషించారని అన్నారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన గ్రామానికి అధికారంగా వీర బైరాన్‌పల్లి పేరు మార్చాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్కకు ఇప్పటికే వినతి పత్రం అందజేశామన్నారు. అభివృద్ధి పనులన్నింటిని రాబోయే ఆరునెలల్లోనే మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేసి పోరాట గాథను భవిష్యత్ తరాలకు తెలిసేలా పాఠ్యపుస్తకాల్లో చేర్చేందుకు కృషి చేస్తాన్నారు. అనంతరం అమరవీరుల కుటుంబాలను శాలువాలతో సన్మానించారు. అలాగే డాక్టర్ చందా రామయ్య రచించిన తెలంగాణ సాయుధ పోరాట పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ బర్మ రాజమల్లయ్య,బీఆర్‌ఎస్ నాయకులు గ్రామా సర్పంచ్‌లు, తదితరులు పాల్గొన్నారు.


