సంగారెడ్డి ఎడ్యుకేషన్: టీ అమ్ముకునే సామాన్య కార్యకర్త ప్రధాని అయ్యి దేశాన్ని ఎక్కువ రోజులు పాలించి నెహ్రూ రికార్డును తిరగరాయడం గర్వ కారణంగా ఉందని మాజీ గవర్నర్ దత్తాత్రేయ అన్నారు. ప్రధానిగా మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని గురువారం బీజేపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అట్టడుగు వర్గాల సంక్షేమం మొదలుకొని దేశ రక్షణ, డిజిటల్ విప్లవం, ఆర్థిక సంస్కరణల వరకు ప్రతి రంగంలోనూ భారత్‌ను అగ్రగామిగా నిలిపిన ఘనత మోదీదేనని కొనియాడారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యసాధన దిశగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. 4,399 రోజుల్లో ఒక్క రోజు కూడా విరామం లేకుండా మోదీ పని చేస్తున్నారని, మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో పాటు తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో మాజీ ఎంపీ బీబీ పాటిల్, జిల్లా అధ్యక్షురాలు గోదావరి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు.
మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ


