నడి రోడ్డుపై కారు బీభత్సం | - | Sakshi
Sakshi News home page

నడి రోడ్డుపై కారు బీభత్సం

Jun 12 2026 7:25 AM | Updated on Jun 12 2026 7:25 AM

● బైక్‌కు, బాటసారికి ఢీకొనడంతో ఒకరు మృతి ● మరొకరికి తీవ్ర గాయాలు ● వెంకట్రావ్‌పేటగేట్‌ వద్ద సంఘటన

● బైక్‌కు, బాటసారికి ఢీకొనడంతో ఒకరు మృతి ● మరొకరికి తీవ్ర గాయాలు ● వెంకట్రావ్‌పేటగేట్‌ వద్ద సంఘటన

కౌడిపల్లి(నర్సాపూర్‌): అతివేగంగా వచ్చిన కారు నడిరోడ్డుపై భీభత్సం సృష్టించింది. రోడ్దు దాటుతున్న బైక్‌ను ఢీకొడంతోపాటు నడుచుకుంటూ వస్తున్న ఓ బాటసారిని ఢీకొట్టింది. దీంతో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని వెంకట్రావ్‌పేటగేట్‌ వద్ద 765డి జాతీయ రహదారిపై గురువారం జరిగింది. ఎస్‌ఐ అమరేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపూర్‌ మండలం అహ్మద్‌నగర్‌కు చెందిన చింతకుంట మల్లేశం(46) తన బైక్‌పై ముట్రాజ్‌పల్లి వైపు నుంచి వెంకట్రావ్‌పేటవైపు వస్తు రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో మెదక్‌ జిల్లా సోషల్‌ వెల్ఫేర్‌ అధికారిని నర్సాపూర్‌ వైపు నుంచి కారులలో మెదక్‌ వస్తుండగా డ్రైవర్‌ కుశంత్‌ నడుపుతున్నాడు. కారు అతివేగంగా వచ్చి బైక్‌ను ఢీకొంది. దీంతో బైక్‌తోపాటు బైక్‌పైఉన్న మల్లేశం ఎగిరి ఎదురుగా వస్తున్న బాటసారి వెంకట్రావ్‌పేటకు చెందిన ఉపాధిహామీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ డప్పు కుమార్‌పై పడి అతన్నిసైతం కారుఢీకొంది. దీంతో మల్లేశం అక్కడికక్కడే మృతి చెందాడు. డప్పు కుమార్‌కు కాలు విరగగా తీవ్రగాయాలు అయ్యాయి.

మృతదేహంతో ధర్నా

మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ మృతదేహాన్ని తిరిగి నర్సాపూర్‌ నుంచి వెంకట్రావ్‌పేటగేట్‌ వద్దకు తీసుకువచ్చారు. రోడ్డుపై ధర్నా, రాస్తారోకోకు ప్రయత్నం చేయగా.. ఎస్‌ఐ బాధితులకు నచ్చచెప్పారు. గొడవ జరగకుండా ముందస్తుగా అదనపు పోలీసులను రప్పించాడు. నిందితుడిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి మృతదేహాన్ని నర్సాపూర్‌ పంపించారు.

కూలీల హాజరు వేసి..

మరో వనివద్దకు వెళుతుండగా ..

వెంకట్రావ్‌పేట గ్రామానికి చెందిన డప్పు కుమార్‌ ఉపాధిహామి ఫీల్డ్‌అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం ఉదయం పనిచేసే కూలీల అటెండెన్స్‌ వేసి మరోచోట పనులు జరుగుతుండటంతో అక్కడికి వెల్లేందుకు రోడ్డు పక్కనుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. ఇంతలో కారు బైక్‌ను ఢీకొట్టి అతన్ని ఢీకొంది. తీవ్రగాయాలు కావడంతో బాధితుడిని సర్పంచ్‌ ఖుత్బుద్దీన్‌ గ్రామస్తులు చికిత్స నిమిత్తం నర్సాపూర్‌కు అక్కడి నుండి మెరుగైన చికిత్సకు హైదరాబాద్‌ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement