4,250 ఇళ్లు రద్దు
అర్హులైన ఇతర లబ్ధిదారులకుకేటాయింపు జాబితాలు పంపాలని ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఇంటి నిర్మాణం పనులు ప్రారంభించని ఇందిరమ్మ గృహాలను రద్దు చేయాలని గృహ నిర్మాణశాఖ నిర్ణయించింది. ఇల్లు మంజూరై తొమ్మిది నెలలు గడుస్తున్నా కనీసం ముగ్గు కూడా పోసుకోలేని లబ్ధిదారుల ఇళ్లను అధికారులు క్యాన్సిల్ చేస్తున్నారు. నిర్మాణ పనులు ప్రారంభించని లబ్ధిదారుల జాబితాలు పంపాలని ఆయా మండలాల ఎంపీడీఓలకు ఆదేశాలు అందాయి. జిల్లావ్యాప్తంగా 4,250 మంది లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్లను రద్దు చేయనున్నారు. ఈ ఆర్థిక ఏడాది మరో నెల రోజుల్లో ముగుస్తుంది. దీంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ గృహాలను ఇతర లబ్ధిదారులకు కేటాయించనున్నట్లు గృహ నిర్మాణశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
తొమ్మిది నెలలు గడుస్తున్నా..
ఇందిరమ్మ లబ్ధిదారులకు 2025 మే నెలలో మంజూరు పత్రాలు అందజేశారు. దాదాపు తొమ్మిది నెలలు గడుస్తున్నప్పటికీ ఇళ్ల నిర్మాణం పనులు ప్రారంభించ లేదు. ఇందుకు పలు కారణాలున్నాయి. ఇందిరమ్మ గృహం విస్తీర్ణం 600 చదరపు అడుగులకు మించకూడదు. ఇరుకుగా ఉంటుందనే కారణంతో చాలా మంది లబ్ధిదారులు ఇంటి నిర్మాణం పనులు ప్రారంభించుకోలేదు. అలాగే ఇంటిస్థలం విషయంలో అన్నాదమ్ములు, కుటుంబసభ్యుల మధ్య వివాదం నెలకొనడం కారణంగా కూడా మంజూరైన ఇందిరమ్మ గృహాలకు ముగ్గు పోసుకోలేదు. కొన్ని సెంటిమెంట్‌ల కారణంగా కూడా ఈ ఏడాది ఇంటి నిర్మాణం పనులు ప్రారంభించలేదు. ఇలా వివిధ కారణాలతో ముగ్గుపోసుకోని ఇళ్లను ఇప్పుడు రద్దు చేసి, అర్హులైన ఇతరులకు కేటాయిస్తామని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇలా వివిధ కారణాలతో ఇళ్ల నిర్మాణం ప్రారంభించుకోలేని లబ్ధిదారులు వద్ద అధికారులు తమ ఇంటిని రద్దు చేయాలని కోరుతూ లేఖలు తీసుకుంటున్నారు.
15 వేల గృహాలు మంజూరు..
జిల్లాలో అన్ని మున్సిపాలిటీలు, గ్రామాలు కలిపి మొత్తం 15,429 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 2,902 గృహాలు మొదట్లోనే వివిధ కారణాలతో రద్దు చేశారు. మిగిలిన 12,527 గృహాలు లబ్ధిదారులకు కేటాయించారు. ఇందులో 8,277 గృహాలకు ముగ్గులు పోసుకున్నారు. 6,683 గృహాలు బేస్‌మెట్ వరకు పూర్తయ్యాయి. 4,966 గృహాలు గోడల నిర్మాణం జరిగింది. 3,826 మంది లబ్ధిదారులు ఇళ్లకు స్లాబ్ వేసుకున్నారు. 354 మంది లబ్ధిదారులు గృహ ప్రవేశాలు చేశారు. కానీ 4,250 మంది లబ్ధిదారులు మాత్రం ఇంటి నిర్మాణం పనులు ప్రారంభించలేదు.
ముగ్గు పోసుకోని లబ్ధిదారుల ఇందిరమ్మ గృహాలు క్యాన్సిల్
లబ్ధిదారులకు ఎస్‌హెచ్‌జీ రుణం..
ఇటీవల కాలంలో ఇంటి నిర్మాణ వ్యయం విపరీతంగా పెరిగిన విషయం విదితమే. సిమెంట్, ఇసుక, కంకర, స్టీలు ధరలు పెరగడంతో నిర్మాణ వ్యయం అమాంతంగా పెరిగింది. ప్రభుత్వం నుంచి రూ.5.5 లక్షలు ఏమాత్రం సరిపోవడం లేదు. అదనపుభారం నిరుపేదల లబ్ధిదారులపై పడుతోంది. ఈ కారణంగా కూడా కొందరు లబ్ధిదారులు ఇంటి నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేసుకోలేకపోతున్నారు. ఇలాంటి లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల నుంచి రుణం ఇప్పించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆదేశాలు జారీ చేశారు. తద్వారా ఇంటి నిర్మాణం పూర్తి చేయించి నిరుపేదలకు గూడు వసతి కల్పించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టారు.


