పెరటికోళ్ల పెంపకంతో ఆదాయం
కౌడిపల్లి(నర్సాపూర్): పెరటికోళ్ల పెంపకంతో గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తామని పీవీఎన్‌ఆర్‌టీవీయూ (పీవీ నర్సింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ) పౌల్ట్రీ విభాగం ప్రొఫెసర్ అండ్ హెడ్, రిసోర్స్‌పర్సన్ డాక్టర్ ఎం హనుమంతరావు అన్నారు. శనివారం మండలంలోని తునికి హరిచంద్‌తండాలో హైదరాబాద్ బాచుపల్లి వీజేఐఈటీ ఆధ్వర్యంలో ఎస్‌టీఐ ప్రాజెక్ట్ ద్వారా గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి పెరటికోళ్ల పెంపకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరటికోళ్ల పెంపకంతో మంచి ఆదాయం లభిస్తుందన్నారు. తండావాసులకు ప్రతి ఇంటికి ఉచితంగా 20 పెరటి కోళ్లు ఇవ్వడంతోపాటు పెంపకంపై శిక్షణ, దాన, వైద్య సదుపాయం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ మల్లిక, రాము, విజ్ఞానజ్యోతి ప్రతినిధులు డాక్టర్ దత్తేశ్, రామక్రిష్ణ, రాకేశ్, జగదీష్, తండావాసులు పాల్గొన్నారు.


